క్యాడ్ డేటా కీలకం! | CAD may have touched 5% of GDP in Q1 | Sakshi
Sakshi News home page

క్యాడ్ డేటా కీలకం!

Published Mon, Sep 30 2013 12:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

క్యాడ్ డేటా కీలకం!

క్యాడ్ డేటా కీలకం!

న్యూఢిల్లీ: ఈ వారంలో మార్కెట్ కదలికలను ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు గణాంకాలు నిర్ధేశించనున్నాయి. ముఖ్యంగా జూన్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) డేటాతోపాటు సెప్టెంబర్ నెల ఆటోమొబైల్, సిమెంట్ కంపెనీల విక్రయాల గణాంకాలు కూడా వెలువడనున్నాయి. దీంతోపాటు వ్యాపార కార్యలాపాలపై పలు ప్రైవేటు సర్వేలు కూడా రానున్నాయి. ఇవన్నీ స్టాక్‌మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, ఈ వారంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో.. నాలుగు ట్రేడింగ్ రోజులు మాత్రమే ఉండటం కూడా గమనార్హం.
 
ఇక ఈ ఏడాది(2013-14) సెప్టెంబర్‌తో ముగిసే రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. కార్పొరేట్ ఫలితాలు మొదలయ్యేవరకూ స్టాక్ సూచీలు నిస్తేజంగానే కదలాడే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అమెరికా రుణ పరిమితి అంశం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లపై నిర్ణయం(అక్టోబర్ 2న) వంటి అంతర్జాతీయ పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగానే గమనించనున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. సోమవారం(30న) ఆర్‌బీఐ జూన్ క్వార్టర్(క్యూ1) క్యాడ్ గణాంకాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు గురై చివరకు నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. గతవారం మొత్తంమీద 537 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 17,727 వద్ద ముగిసింది.
 
 క్యాడ్ మళ్లీ పైకి...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ1)లో క్యాడ్(మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసం) మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీడీపీతో పోలిస్తే క్యాడ్ 4 శాతంగా నమోదుకావచ్చని డీబీఎస్ పేర్కొంది.  ముఖ్యంగా ఈ మూడు నెలల్లో బంగారం దిగుమతులు పెరగడం, ఎగుమతుల తగ్గుదలే దీనికి కారణమని తెలిపింది. గతేడాది(2012-13)లో రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(88.8 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లిన క్యాడ్... ఆఖరిదైన మార్చి క్వార్టర్‌లో మాత్రం కాస్త శాంతించి 3.6 శాతానికి(18.1 బిలియన్ డాలర్లు) పరిమితమైన సంగతి తెలిసిందే. మరోపక్క, క్యూ1లో క్యాడ్ 5%గా ఉండవచ్చునని ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యాడ్ పెరుగుదల ప్రభావంతోనే రూపాయి పతనమవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి(68.80) పడిపోయి.. ప్రస్తుతం 63 స్థాయిలో ఉంది.
 
 గణాంకాల వరుస...
 అక్టోబర్ 1న ఆటోమొబైల్ కంపెనీలు, సిమెంట్ అమ్మకాల గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో మంగళవారం నాడు ఈ రెండు రంగాల స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. తయారీ రంగానికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా రానున్నాయి. అక్టోబర్ 4న దేశీ సేవా రంగ పనితీరుపై సర్వే నివేదిక వెలువడనుంది. కాగా, దేశీయంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారీ పరిణామాలేవీ ప్రస్తుతానికి లేవని, అక్టోబర్ 2వ వారంలో క్యూ2 కార్పొరేట్ ఫలితాలు ప్రారంభమైన తర్వాతే మార్కెట్ ట్రెండ్‌ను అంచనావేయడానికి వీలవుతుందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) దీపేన్ షా వ్యాఖ్యానించారు. దేశీ కంపెనీల ఆర్థిక ఫలితాలు మందకొడిగానే ఉండొచ్చని కూడా ఆయన అంచనా వేశారు.
 
 ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో స్వల్పకాలానికి బేరిష్ ధోరణి ఉండొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. రానున్న ట్రేడింగ్ సెషన్‌లలో 5,800 పాయింట్లు.. నిఫ్టీకి కీలక నిర్ణాయక స్థాయి అని పేర్కొన్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్ దిశను నిర్ధేశించడంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ రుణ పరిమితి విషయంపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. అమెరికాలో వ్యయాల కోతపై చర్చిం చేందుకు మరికొంత గడువును కోరే అవకాశం ఉందని షా చెబుతున్నారు.
 
 కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల జోరు...
 దేశీ స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా పడిపోతున్న రూపాయి, మందగమనంలో చిక్కుకున్న వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న పలు చర్యలు విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నెలలో 27వ తేదీ నాటికి 2.09 బిలియన్ డాలర్ల(సుమారు రూ.13,228 కోట్లు) నిధులను స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా కుమ్మరించారు. ఆగస్టులో నికరంగా రూ.16,000 కోట్లను వెనక్కితీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ సెప్టెంబర్‌లో కొనుగోళ్ల బాటపట్టడం గమనార్హం. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలోకి నికరంగా రూ. 73,400 కోట్ల నిధులను పెట్టుబడిగా పెట్టగా.. డెట్ మార్కెట్ నుంచి రూ.36,914 కోట్లను నికరంగా ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement