సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి ప్రతీకారం
కోల్‌కతా: సుప్రీం కోర్టుకు, కలకతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటం కొనసాగుతోంది. జస్టిస్ కర్ణన్‌కు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించగా.. ఆయన కూడా ఏడుగురు జడ్జిలపై ఇలాంటి ఆదేశాలే జారీ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. సుప్రీం కోర్టు జడ్జిలను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను జస్టిస్ కర్ణన్ ఆదేశించారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను తాను పాటించబోనని, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని జస్టిస్ కర్ణన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తనకు బలవంతంగా వైద్యపరీక్షలు చేయించేందుకు వస్తే పశ్చిమబెంగాల్ డీజీపీని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గతంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ జస్టిస్ కర్ణన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన విచారణకు హాజరుకావడం లేదు. ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. తనపై చర్యలు తీసుకునే హక్కు సుప్రీం కోర్టుకు లేదంటూ, జస్టిస్ కర్ణన్ వారిపైనే చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.