జస్టీస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు!
న్యూఢిల్లీ: వివాదాస్పద కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించింది. మే 5లోగా వైద్య పరీక్షలు నిర్వహించి.. 8వ తేదీ కల్లా కర్ణన్ మానసిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సోమవారం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెడికల్ బోర్డ్‌ను ఆదేశించింది. కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకుగాను పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ విషయంలో కర్ణన్ ఏమైనా చెప్పాలనుకుంటే అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే ఆయన చెప్పేదేమీ లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 18కి వాయిదా వేసింది. తోటి న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను భారత న్యాయ చరిత్రలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరైన సిట్టింగ్ న్యాయమూర్తిగా కర్ణన్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.