సుప్రీంకోర్టుపై జస్టిస్ కర్ణన్ ఆగ్రహం
కోల్‌కతా: సుప్రీంకోర్టుపై వివాదాస్పద కలకత్తా హైకోర్టు జస్టిస్ సీఎస్ కర్ణన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానసిక స్థితిని పరీక్షించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా తాను బలహీనుడ్ని కాదని కర్ణన్ చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కావాలనే తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని అన్నారు. దళితుడిని కాబట్టే తనను అవమానిస్తున్నారని, తనను ప్రశ్నిస్తున్న జడ్జిలంతా అవినీతిపరులే అని కర్ణన్ పేర్కొన్నారు.
కాగా జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. మే 5లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. 8వ తేదీ కల్లా కర్ణన్ మానసిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సోమవారం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెడికల్ బోర్డ్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 18కి వాయిదా వేసింది. తోటి న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను భారత న్యాయ చరిత్రలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరైన సిట్టింగ్ న్యాయమూర్తిగా కర్ణన్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.