మర్యాద కోసం పిలిస్తే.. రాద్ధాంతమా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన ఒకరోజు తర్వాత పీఎంఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మాజీ ప్రధానమంత్రులు చాలామందిని ఈ భేటీకి పిలిచామని పీఎంఓ అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడకు కూడా ఆహ్వానం వెల్లిందని, అయితే ఆయన బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో రాలేకపోతున్నట్లు చెప్పారని అన్నారు.
దాంతో ప్రధాని ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి.. ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మోదీని కలవాల్సిందిగా ఆహ్వానించారు. ఏడాది పాలన పూర్తయిన ఒకరోజు తర్వాత.. మే 27న ప్రధాని నరేంద్రమోదీ తన అధికారిక నివాసం నెం.7 రేస్కోర్సు రోడ్డు నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ విమర్శించడం.. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా తిప్పికొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి.