
ప్రజల్లోకి ప్రతికూల సందేశం వెళ్తుంది
పాట్నా : బీహార్ ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ చివరి నిమిషంలో రద్దు కావడంపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. మోదీ ర్యాలీ చివరి నిమిషంలో రద్దు అవడం ప్రజలలో ప్రతికూల సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు పార్టీలో ఇటు ఎన్నికల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయని అవి తొలగిపోవాలని ఆకాంక్షించారు. అయితే బీహార్ బీజేపీ శాఖలో కొంత మంది నాయకులు నియంతల్లా వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నిత్యవసర వస్తువల ధరలు ఆకాశాన్ని తాకడంపై శత్రుఘ్న సిన్హా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కందిపప్పు ధర కేజీ రూ.200 చేరుకోవడంపై నిరసన తెలిపారు. ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల ఉల్లి ధర సామాన్యుడిని ఎంత కలవరానికి గురి చేసిందో సిన్హా ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం సిన్హా ట్విట్ట్ చేశారు.
బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ హీరోలతో బీజేపీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శత్రుఘ్న సిన్హాను మాత్రం పార్టీ పక్కన పెట్టింది. దీనిపై ఆయన ఆ పార్టీ నేతలపై ఒకింత ఆగ్రహాంతో ఉన్నారు. బీహార్లో రెండో విడత పోలింగ్ అక్టోబర్ 16వ తేదీన జరగగా... ఆదే రోజు బాక్సర్, పాలిగంజ్, వైశాలీలో ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించవలసి ఉంది. అయితే ఆ ర్యాలీలు చివరి నిమిషంలో రద్దు అయింది. మూడో విడత పోలింగ్ 28వ తేదీన ఆయా ప్రాంతాల్లో జరగనుంది. ఇంత ముందుగా ర్యాలీ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆ పార్టీ నాయకత్వం భావించి... ఈ ర్యాలీలు రద్దు చేసినట్లు సమాచారం.