స్కూల్లో నరమేధం | Carnage in Pakistan school as Taliban attack kills 141, mostly children | Sakshi
Sakshi News home page

స్కూల్లో నరమేధం

Published Wed, Dec 17 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

Carnage in Pakistan school as Taliban attack kills 141, mostly children

* పాకిస్తాన్‌లో పేట్రేగిన తాలిబన్లు
* పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు
* 141 మంది మృతి.. 130 మందికి గాయాలు
* బడిలోకి చొరబడిన ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు
* తరగతి గదులపై తూటాల వర్షం.. మృతుల్లో 132 మంది విద్యార్థులు
* పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడిలో ముగ్గురు తాలిబన్లు హతం
* తమను తాము పేల్చేసుకున్న నలుగురు మిలిటెంట్లు
* ఈ ఘటన జాతీయ విషాదమన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
* దాడి తామే చేశామని తెహ్రీక్ ఈ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటన
* ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఊహకందని ఉన్మాదం..
మాటలకందని రాక్షసత్వం..
హృదయం వికలమయ్యే కర్కశత్వం..
నిలువెల్లా విషం నిండిన
ఉగ్ర భుజంగాల కరాళ నృత్యం..
అన్నెం, పున్నెం ఎరుగని పసిమొగ్గలపై
తూటాలతో విరుచుకుపడిన మారణహోమం!
- పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జడలు విప్పిన ‘ఉగ్ర’భూత వికృత రూపాన్ని వర్ణించడానికి ఈ పదాలు చాలవు!!

ప్రతీకార పొరలతో కళ్లు మూసుకొనిపోయిన తాలిబన్ రక్కసిమూక పాక్‌లోని ఓ సైనిక పాఠశాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. తరగతి గదుల్లో ప్రశాంతంగా పరీక్ష రాసుకుంటున్న విద్యార్థులపై విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించింది. 141 మంది ప్రాణాలను బలితీసుకున్న మృత్యుహేళ పెషావర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హింసోన్మాదం నెత్తికెక్కిన రాక్షసుల తుపాకీ గుండ్ల తాకిడికి స్కూలే స్మశానంగా మారిపోయింది.

ఛిద్రమైన పసిదేహాలు.. బాలబాలికల ఆర్తనాదాలతో కూడిన దృశ్యాలు అందరినీ నివ్వెరపరిచాయి. సైన్యం ఎదురుదాడి నుంచి రక్షించుకునేందుకు చిన్నారులనే రక్షణ కవచాలుగా మార్చుకున్న ఉగ్రవాదులు ప్రపంచానికి తమ వికృత రూపాన్ని చూపించారు. చరిత్రలో చెరగని రక్తపు మరకగా నిలిచే ఈ దారుణ ఘాతుకానికి తామే బాధ్యులమంటూ పాక్‌లోని ‘తెహ్రీక్ ఈ తాలిబన్’ సంస్థ ప్రకటించింది. ఉత్తర వజీరిస్తాన్‌లో పాక్ సైన్యం దాడులకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ప్రకటించింది.

పెషావర్: పాకిస్తాన్‌లో ‘ఉగ్ర’ భూతం మరోసారి విశ్వరూపం చూపింది. ఈ సారి అభంశుభం ఎరుగని చిన్నారుల ప్రాణాలు లక్ష్యంగా విజృంభించింది. పెషావర్‌లో సైన్యం నిర్వహిస్తున్న పాఠశాలలోకి మంగళవారం ఉదయం భారీ ఎత్తున ఆయుధాలతో, పారా మిలటరీ సరిహద్దు దళ సైనికుల దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఆత్మాహుతి దళ తాలిబన్లు.. ఆ పాఠశాలలో నెత్తుటేర్లు పారించారు. వాచ్‌మెన్‌తో ప్రారంభించి.. సిబ్బంది, ఉపాధ్యాయులు, ముఖ్యంగా విద్యార్థులు లక్ష్యంగా తూటాల వర్షం కురిపించారు. ప్రతీ తరగతి గదిలోకి వెళ్లి పరీక్ష రాసుకుంటున్న విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 8 గంటల పాటు విధ్వంసం సృష్టించారు.

వారి కాల్పుల్లో 141 మంది చనిపోగా, వారిలో 132 మంది విద్యార్థులున్నారు. కాల్పుల్లో 130 మంది గాయాలపాలయ్యారు. వారు పెషావర్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమాచారం అందుకున్న ఆర్మీ ఘటనాస్థలికి చేరుకుని ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ చేపట్టింది. స్కూల్లోకి ప్రవేశించి తాలిబన్లపై ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఆర్మీ దాడులను ఎదుర్కొనేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉగ్రవాదులు రక్షణ కవచాలుగా ఉపయోగించుకున్నారు. అయినా, అప్రమత్తంగా వ్యవహరించిన సైనికులు చాలామంది విద్యార్థులను రక్షించగలిగారు.

ఉగ్రవాదుల కాల్పుల సమయంలో టీచర్ సూచన మేరకు ముందు జాగ్రత్త చర్యగా తరగతి గదుల్లో నేలపైన పడుకుని సురక్షితంగా ఉన్న విద్యార్థులను పాఠశాల వెనుక ద్వారం ద్వారా బయటకు పంపించారు. మంగళవారం రాత్రికి ఆపరేషన్ ముగిసింది. నలుగురు మిలిటెంట్లు తమనుతాము పేల్చేసుకోగా, మరో ముగ్గురిని ఆర్మీ మట్టుబెట్టింది. ఉగ్రవాదుల దాడిలో 132 మంది విద్యార్థులు, 9 మంది సిబ్బంది మరణించారని సైనిక దళాల ముఖ్య ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిమ్ బజ్వా ప్రకటించారు.

118 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది, ఏడుగురు సైనికులు, ఇద్దరు సైన్యాధికారులు గాయపడ్డారన్నారు. 960 మందిని రక్షించామన్నారు.ఉగ్రవాదులు భారీ మందుగుండు, ఆహార పదార్థాలతో వచ్చారని, దాడిని కొన్ని రోజుల పాటు కొనసాగించే ఉద్దేశంతో వారు వచ్చి ఉండొచ్చ అన్నారు. ఉగ్రవాదుల నుంచి డిమాండ్లేమీ రాలేదని, ఎంతమందిని వీలైతే అంతమందిని చంపే ఉద్దేశంతోనే వారు ఈ దాడికి దిగారని వివరించారు.

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు
ఈ ఘటనను జాతీయ విషాదంగా పేర్కొన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ వెళ్లారు. ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.  పాకిస్తాన్‌లో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.  ఈ దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను స్థానిక కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రి, లేడీ రీడిండ్ హాస్పిటల్‌ల్లో భద్రపరిచారు. చనిపోయిన విద్యార్థుల్లో చాలామందిపై చాలా దగ్గరి నుంచి(పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు  మీడియా పేర్కొంది.

ఆ బాధ వారికీ తెలియాలి
మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో స్కూల్ పక్కనున్న స్మశాన వాటిక ద్వారా పాఠశాలలోకి ఉగ్రవాదులు ఆయుధాలతో ప్రవేశించారని, సల్వార్ కమీజులు ధరించి, పెద్దపెద్ద గడ్డాలతో ఉన్న వారంతా అరబిక్ బాషలో మాట్లాడారని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన ఒక విద్యార్థి తెలిపాడు. వారంతా విదేశీయుల్లా ఉన్నారన్నాడు. ఉగ్రవాదులు ప్రవేశించిన సమయంలో ఆ స్కూళ్లో విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ అంతా కలిపి దాదాపు వెయ్యి మందికి పైగా ఉన్నారు.

కాగా, ఈ దాడికి తామే బాధ్యత తీసుకుంటున్నామని పాక్‌కు చెందిన తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పెషావర్‌కు సమీపంలో ఉన్న ఉత్తర వజీరిస్తాన్‌లో మిలటరీ చర్యకు నిరసనగా ఈ దాడి చేసామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. మిలటరీ దాడుల్లో తమవారు చనిపోయినప్పుడు తాము అనుభవించిన బాధను సైనికులు కూడా అనుభవించాలనే ఉద్దేశంతో ఈ దాడి చేశామన్నారు. ఉత్తర వజీరిస్తాన్‌లో వి పాక్ ప్రభుత్వం  సైనిక చర్య ‘జర్బ్ ఇ అజబ్’ను పెద్ద ఎత్తున ప్రారంభించింది. అప్పటినుంచి  1300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఈ సైనిక చర్యకు వ్యతిరేకంగానే ఆర్మీ స్కూల్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు తెహ్రీక్ ఇ తాలిబన్ ప్రకటించింది.

ఉగ్రవాదంపై పోరు ఆగదు: షరీఫ్
పెషావర్: ఈ నరమేధాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల ఉన్మాదాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అయితే తాలిబన్లపై తన ప్రభుత్వం సాగిస్తున్న సైనిక చర్యలను ఈ మారణకాండ ఎంతమాత్రం నిలువరించబోదన్నారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో తుడిచిపెట్టేదాకా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. దాడిని పాక్ నేత, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ తీవ్రంగా ఖండించారు.

మానవత్వంపై జరిగిన నేరమిది: భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సైనిక స్కూలుపై తాలిబన్ల మారణహోమాన్ని పొరుగు దేశమైన భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ  ముక్తకంఠంతో ఖండించాయి.

ఉగ్ర రక్కసిపై ఐక్యంగా పోరాడాలి: ప్రణబ్, మోదీ
ఈ నరమేధం ఉగ్రవాదుల ఉన్మాద తీవ్రతకు నిదర్శనం. ప్రతి దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి రెట్టింపు చర్యలు చేపట్టాలి. స్కూలు విద్యార్థులపై తాలిబన్ల మారణహోమం పిరికిపందల మతిలేని, చెప్పనలవికాని క్రూరమైన చర్య.

పాక్‌కు మా మద్దతు: ఒబామా
ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్‌కు మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటిస్తాన్నా. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరోసారి నైతిక పతనాన్ని చాటుకున్నారు.

చీకటి రోజు: సత్యార్థి (నోబెల్ శాంతి బహుమతి గ్రహీత)
తాలిబన్ల నరమేధం మానవత్వానికే చీకటి రోజు. బందీలుగా పట్టుకున్న విద్యార్థులను తాలిబన్లు విడిచిపెడితే నాకు నేనుగా వారికి బందీని అవుతా.

గుండె పగిలింది: మలాలా (నోబెల్ బహుమతి గ్రహీత)
దాడితో నా గుండె పగిలింది. స్కూళ్లలో ఇలాంటి ఘాతుకం తగదు.  ఇది పరికిపంద చర్య.

గతంలోనూ నెత్తుటి మరకలు...
* పాకిస్తాన్‌లో తాలిబన్లు పసిమొగ్గలను చిదిమేసినటువంటి దారుణ మారణకాండలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. వీటిలో రష్యా పాఠశాలలో జరిగిన ఉదంతంలో అత్యధికంగా 386 మంది బలి అయ్యారు.

* బెస్లన్(రష్యా), సెప్టెంబరు1, 2004: 186 మంది చిన్నారులు సహా 386 మంది బలికాగా, 700 మంది గాయపడ్డారు. 32 మంది చెచెన్   మిలిటెంట్లు  ‘స్కూల్ నంబర్ వన్’లో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.   

* బాత్ స్కూల్(అమెరికా), మే 18, 1927: 45 మంది చనిపోగా, 58 మంది గాయపడ్డారు. మిచిగన్‌లోని బాత్ టౌన్‌షిప్‌లో గల స్కూలులో మూడు బాంబులు పేల్చి స్కూలు బోర్డు మాజీ సభ్యుడు ఆండ్రూ కిహో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

* వర్జీనియా టెక్(అమెరికా), ఏప్రిల్ 16, 2007: 32 మంది మృతి. 17 మందికి గాయాలు. వర్జీనియాలోని పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో చొరబడిన సియంగ్ హూయి చో అనే ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులు జరిపి తనను తాను కాల్చేసుకున్నాడు.

‘మరణాన్ని దగ్గరగా చూశా...’
పెషావర్: తాలిబన్ల నరమేధంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డ షారుఖ్‌ఖాన్(16) అనే విద్యార్థి ఆ భీతావహాన్నికళ్లకు కట్టినట్లు వివరించాడు. కాళ్లలోకి తూటాలు దూసుకెళ్లి భరించలేనంత నొప్పి కలుగుతున్నా  ప్రాణాలను కాపాడుకునేందుకు నొప్పిని పంటిబిగువున అదిమిపట్టి, తన ఆర్తనాదాలు ముష్కరులకు వినబడకుండా నోట్లో టై కుక్కుకొని ఉగ్రవాదులకు విగతజీవిలా కనిపించినట్లు చెప్పాడు. మరణాన్ని దగ్గరి నుంచి చూశానని లేడీ రీడింగ్ ఆస్పత్రిలో షారుఖ్ తెలిపాడు. ‘సైనిక దుస్తుల్లో ఉన్న నలుగురు సాయుధులు స్కూలు ఆడిటోరియంలోకి  చొచ్చుకొచ్చారు. సహచరులతో కలసి నేను కెరీర్స్ గెడైన్స్ సెషన్‌లో ఉన్నా. వారిని చూడగానే బెంచీల కింద దాక్కోవాలంటూ ఎవరో బిగ్గరగా అరిచారు.

సాయుధులంతా కాల్పులు జరిపే ముందు అల్లాహు అక్బర్ అని అరిచారు. వారిలో ఒకడు బెంచీల కింద దాక్కున్న విద్యార్థులు చూడాలని మరొకడిని ఆదేశించడంతో నల్ల బూట్లు వేసుకున్న వ్యక్తి నా వద్దకు వచ్చాడు. నా మోకాళ్ల కింద కాల్చాడు. ఆపై నా సహచరుల శరీరాల్లోకి తూటాల వర్షం కురిపించాడు.  కళ్లు మూసుకొని కదలకుండా పడుకున్నా. అయినా నా శరీరం వణుకుతూనే ఉంది. మరణాన్ని ఎంతో దగ్గరి నుంచి చూశా. నల్ల బూట్లు నావైపు రావడాన్ని మరచిపోలేను. ఆ వ్యక్తి అలా వస్తుంటే మరణం నావైపు నడిచి వస్తున్నట్లు అనిపించింది’ అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement