మమతా బెనర్జీకి కేంద్రం మరో షాక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవల సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ రోజు సుదీప్‌ను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది.
డిసెంబర్ 30న ఇదే కేసులో టీఎంసీకే చెందిన ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.