జెట్ డీల్‌లో ఎతిహాద్‌పై రూ. కోటి జరిమానా
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలు డీల్ విషయంలో అబు ధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌పై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 1 కోటి జరిమానా విధించింది. 24 శాతం వాటాల కొనుగోలుకి సంబంధించి అనుమతులు కోరే అంశంలో పూర్తి సమాచారం అందించలేదన్న ఆరోపణలు ఇందుకు కారణం. 60 రోజుల్లోగా ఎతిహాద్ ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఒప్పందానికి గతంలో ఇచ్చిన అనుమతులపై ఈ పెనాల్టీ ప్రభావమేమీ ఉండదని సీసీఐ పేర్కొంది. లండన్ ఎయిర్‌పోర్టులో స్లాట్ల పరస్పర బదలాయింపు లావాదేవీ వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్న నిబంధన తెలియలేదన్న ఎతిహాద్ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాను రూ. 1కోటికే పరిమితం చేసినట్లు తెలిపింది. అయితే, సీసీఐలో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి భిన్నంగా మరో సభ్యుడు అనురాగ్ గోయల్ మాత్రం పెనాల్టీ రూ. 10 కోట్ల మేర ఉండాలని అభిప్రాయపడ్డారు.