న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో అబుధాబీ కంపెనీ ఎతిహాద్‌కు 24% వాటా లభించింది. ఇందుకు ఎతిహాద్ రూ. 2,069 కోట్లను వెచ్చించింది. డీల్ పూర్తయినట్లు రెండు కంపెనీలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ నెల 12కల్లా అన్ని రకాల అధికారిక నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందడం ద్వారా డీల్‌ను పూర్తిచేయగలిగినట్లు తెలిపాయి. వెరసి దేశీయ విమానయాన సంస్థలో ఒక విదేశీ కంపెనీ చేసిన తొలి పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా ఈ డీల్ నిలిచింది. దీంతో రూ. 10 ముఖ విలువగల 2,72,63,372 షేర్లను ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు జెట్ కేటాయించింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేరుకి రూ. 754.74 ధరలో వీటిని జారీ చేసింది. ఫలితంగా జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్‌కు 24% వాటా లభించింది. కాగా, నిబంధనలకు అనుగుణంగా జెట్‌లో చైర్మన్, ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా 51%కు పరిమితమైంది. కంపెనీ చెల్లించిన మూలధనం 8.63 కోట్ల నుంచి 11.34 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర 1.6% లాభపడి రూ. 326 వద్ద ముగిసింది.
జెట్‌లో ఎతిహాద్ డెరైక్టర్లు
బుధవారం(20)నుంచి ఎతిహాద్ ప్రెసిడెంట్, సీఈవో జేమ్స్ హోగన్‌తోపాటు, సీఎఫ్‌వో కూడా జెట్ ఎయిర్‌వేస్‌లో అదనపు డెరైక్టర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు రెండు సంస్థలూ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. వీలైనంత త్వరగా కస్టమర్లకు ఉత్తమ సర్వీసులను అందించేందుకు వీలుగా రెండు సంస్థలూ వెంటనే పరస్పరం సహకారాన్ని మొదలు పెట్టినట్లు తెలిపాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలను తదుపరి వెల్లడిస్తామని తెలిపాయి. ఈ బాటలో దేశీయంగా మరిన్ని సంస్థలు కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియాతో పాటు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తోనూ టాటా గ్రూప్ జత కట్టడం తెలిసిందే.
ఆర్థికంగా లాభం: ఎఫ్‌డీఐ లభించడం వల్ల కంపెనీ ఆర్థికంగా బలపడటమేకాకుండా, ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటుందని డీల్ పూర్తయిన సందర్భంగా జెట్ ప్రమోటర్ గోయల్ పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటని, తాజా భాగస్వామ్యంవల్ల రెండు సంస్థలూ పటిష్టమవుతాయని ఎతిహాద్ సీఈవో హోగన్ వ్యాఖ్యానించారు.
జెట్-ఎతిహాద్ డీల్ పూర్తి
Published Thu, Nov 21 2013 12:07 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement