దావూద్ కోసం 5 ప్రత్యేక టీంలు!
గత రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పక్కా ప్రణాళికను రూపొందించిన భారత్.. ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్(రా), సీబీఐ ఇంటర్ పోల్ వింగ్ ల నుంచి మొత్తం 50 మందిని ఇందుకోసం ఎంపిక చేసింది.
నాలుగు వింగ్ ల నుంచి మొత్తం పది మంది సభ్యులు ఒక్కో టీంకు ప్రాతినిధ్యం వహిస్తారు. పాకిస్తాన్, యూఏఈతో పాటు ప్రపంచదేశాల్లో దావూద్ గ్యాంగ్ కదలికలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నడుపుతున్న 11మంది దావూద్ సన్నిహితులను నిఘా వర్గాలు గుర్తించాయి. విమానయానం, పవర్, ఆయిల్, కన్ స్ట్రక్షన్, గార్మెంట్ రంగాల్లో ఉన్న ఏడు దావూద్ కంపెనీలను కూడా నిఘా సంస్థలు అనుసరిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో నివసిస్తున్న దావూద్ ఆరోగ్యపరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం ఉంది. పాక్ లో ఉన్నా కూడా తన కుటుంబానికి, తనకు ప్రమాదం ఉన్నట్లు దావూద్ భావిస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఆరు బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజ్ కార్లను దావూద్ కుటుంబం తెప్పించుకుందని తెలిపాయి. షేక్ ఇస్మాయిల్ అనే వ్యాపారస్తుడి పేరు మీద దావూద్ ప్రస్తుతం కరాచీలో నివసిస్తున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా దావూద్ ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా ఆపేశాడు. ప్రస్తుతం అతని భార్య మెహజబీన్ షేక్ ఫోన్లను తీసుకుంటుందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ లను కూడా ఆమే రన్ చేస్తోంది.