
‘నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్‌ఆర్ సీపీదే’
నంద్యాల: నంద్యాల సీటు ఎప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా నంద్యాల సీటును వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకుందని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆత్రుత పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు ప్రజలను మభ్యపెట్టడానికే అని అంబటి వ్యాఖ్యానించారు.
అంబటి రాంబాబు శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట‍్లాడుతూ...అవసరం అయితే కొండమీద కోతిని కూడా తీసుకు వచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని దుష్ట, దౌర్భాగ్య చరిత్ర ఆయనదేనని ధ్వజమెత్తారు. ‘ భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరితే పదవి ఇస్తానని ఆశ చూపారు. పార్టీ మారక ఇచ్చిన హామీ విస్మరించారు. భూమాను మోసం చేసిన చంద్రబాబు...నంద్యాల ప్రజలను మోసం చేయలేరా?. ఓటుకు రూ.5వేలు ఇస్తానని చంద్రబాబు అన్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా నంద్యాల ప్రజలను కొనలేరు.’ అని అంబటి అన్నారు.
నంద్యాల ప్రజలకు తెలుసు
చంద్రబాబు నీతులు వల్లె వేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయే నాటికి ఆయన వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అని....ఎవరైనా ఎమ‍్మెల్యే చనిపోతే ఆ సీటు అదే పార్టీకి వదిలేసే సంప్రదాయం ఉందన్నారు. కానీ చంద్రబాబు సంప్రదాయానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, నంద్యాల ఉప ఎన్నిక కోసం వందల కోట్లు వెచ్చిస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో నంద్యాల అభివృద్ధి గుర్తురాలేదా అని సూటిగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక కోసం చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది ప్రేమో? నాటకమో? నంద్యాల ప్రజలకు తెలుసు అని కన్నబాబు అన్నారు.