అందుకే ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టమన్నా..
- వ్యవస్థను మార్చడం నా ఒక్కడి వల్లా కాదని ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టమన్నా..
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, గుంటూరు: ‘నేను ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది.. నేను అనారోగ్యం పాలైతే రాష్ట్రానికి సుస్తీ చేస్తుంది..’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘నేను ఆహార నియమాలను చాలా బాగా పాటిస్తాను. నా భార్య చేతిలో ఉండే రిమోట్ నన్ను కంట్రోల్ చేస్తుంది. నేను బతకడానికి తింటా కానీ.. తింటానికి బతకను..’ అని చెప్పారు.
బుధవారం రాత్రి గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది తానేనని, తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థను మార్చడం తన ఒక్కడి వల్లా కాదని, మీలాంటివారు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను మార్చాలంటూ తాను కోరితేనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చెప్పుకొచ్చారు.