మరోసారి భారతరత్న!
దివంగత నేతకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని టీడీపీ మహానాడులో తీర్మానం
- దాదాపు ప్రతి మహానాడులో తీర్మానం చేయిస్తూ తర్వాత అటకెక్కిస్తున్న బాబు
- విశాఖ మహానాడులో రెండోరోజు 13 తీర్మానాలు ఆమోదం
- కౌలు రైతుల సంక్షేమానికి చట్టం తెస్తామని చంద్రబాబు వెల్లడి
విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని టీడీపీ మహానాడులో మరోసారి మొక్కుబడిగా తీర్మానం చేశారు. దాదాపు ప్రతి మహానాడులో ఈ మేరకు తీర్మానం చేయడం, తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దూరంగా ఉండడంపై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా మళ్లీ తీర్మానం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి మహానాడు ముసాయిదా తీర్మానాల్లో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించే తీర్మానం తప్ప భారతరత్న ఇవ్వాలనే తీర్మానం లేదు. అయినా తాజాగా ఈ మేరకు తీర్మానం చేయడం గమనార్హం. అసలు ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం రావడం చంద్ర బాబుకు ఇష్టంలేదనే వాదన టీడీపీలో వినిపి స్తోంది. కేవలం విమర్శల నుంచి తప్పించుకో వడానికే ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారనే తప్ప ఆయనపై అభిమానంతో కాదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. గతంలో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో తాను చక్రం తిప్పానని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అప్పట్లోనే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదని టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
మహానాడులో రెండోరోజు ఆదివారం మొత్తం 13 తీర్మానాలను ఆమోదించారు. తీర్మానాలపై జరిగిన ప్రతి చర్చలోనూ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ప్రతి అంశంలోనూ అండగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. మహానాడులో ఆది వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సందర్భాల్లో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఏం చెప్పారంటే...
‘‘రాష్ట్రంలో వాస్తవ సాగుదార్లుగా ఉన్న కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఒక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం. రైతులు(భూ యజమానులు), కౌలు రైతులకు మధ్య అవగాహన ఉండేలా ఈ చట్టం రూపొందిస్తాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రైతులకు తప్ప కౌలుదార్లకు అందడం లేదన్న విమర్శల నేపథ్యంలో కొత్త చట్టం గురించి ఆలోచిస్తున్నాం.
ఒప్పందాలు 1,529... సిద్ధమైనవి 23
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపనలో భాగంగా ఇప్పటిదాకా 1,529 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో 927 ఒప్పందాల పరిశీలన పూర్తయింది. 23 ఒప్పందాలు అమలుకు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా 2.6 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
పరకాలది రాజకీయ నియామకం
టీడీపీ మహానాడులో మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రమేయం గురించి పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. పరకాల ప్రభాకర్‌ది నాన్ అఫీషియల్ పొలిటికల్ అపాయింట్‌మెంట్ అని, అతను ప్రభుత్వ ఉద్యోగి కాదని స్పష్టం చేశారు. ఆ హోదాలోనే ఆయన తనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, దీనిపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకే ఈ వివరణ అని చెప్పారు. కాగా ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని పరకాల ప్రభాకరే మహానాడులో ప్రవేశపెట్టడం విశేషం. ఇది చర్చనీయాంశంగా మారింది.
రెండోరోజూ జాడలేని ఎన్టీఆర్ కుటుంబీకులు
మహానాడులో రెండోరోజు కూడా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ రెండోరోజైనా మహానాడుకు వస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ, వారి జాడ కనిపించలేదు. ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండోరోజు కూడా గైర్హాజరయ్యారు. నందమూరి మోహనకృష్ణ తనయుడు, సినీ నటుడు తారకరత్న ఒక్కరే ఆదివారం మహానాడుకు వచ్చారు. ఆయనతోపాటు సినీ నటుడు వేణుమాధవ్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీలు మాగంటి మురళీమోహన్, శివప్రసాద్, రాయపాటి సాంబశివరావు కూడా గైర్హాజరయ్యారు.
అధ్యక్ష పదవికి బాబు తరçఫున నామినేషన్లు
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు తరఫున పలువురు నాయకులు మహానాడులో 33 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేస్తున్నట్లు ప్రకటిం చారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి గా తెలంగాణకు చెందిన పెద్దిరెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తరఫున 33 సెట్ల నామినేషన్లను పలువురు నాయకులతో దాఖలు చేయించారు. సోమవారం లాంఛనంగా చంద్రబాబు మూడోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.