తెలంగాణకు కట్టుబడి ఉన్నా... ఏకపక్ష విభజన సరికాదు
రాజధాని ఉన్న ప్రాంతం విడిపోవడం గతంలో లేదు
రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలంటే దిగ్విజయ్ అపహాస్యం చేశారు
లబ్ధిదారులతో చర్చించనందువల్లే ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని తెలుగుదే శం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అందులో వెనకడుగు వేసేది లేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలతో ఏకపక్షంగా రాష్ర్ట విభజన నిర్ణయం తీసుకోవటం సరికాదని విమర్శిస్తూనే.. మళ్లీ దేశ చరిత్రలో రాజధానిగా ఉన్న ప్రాంతం రాష్ర్టం నుంచి విడిపోతామని ఎపుడూ చెప్పలేదని గందరగోళం సృష్టించారు. ఆయన మంగళవారం తన నివాసంలో దాదాపు గంటకుపైగా విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. గ త వారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడగా... ఆ మరుసటి రోజే చంద్రబాబు రాష్ర్ట విభజన అంశంపై ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని సోమవారం సీఎం విలేకరుల సమావేశంలో చెప్పగా, తమ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించిందని మంగళవారం చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ రోజూ మీడియాతో మాట్లాడుతున్నారని, ఇకనుంచి తానూ రోజూ అంతకంటే ఎక్కువ మాట్లాడుతానని ప్రకటించారు. సమావేశంలో ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వకుండా దాటవేశారు. తాను రాజకీయం కోసం మాట్లాడటం లేదంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవటానికి నాలుగైదు లక్షల కోట్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని తాను డిమాండ్ చేస్తే దిగ్విజయ్ సింగ్ అపహాస్యం చేయటంతో పాటు అంత అవసరం లేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. నూతన రాజధాని నిర్మాణం అంటే సచివాలయం, డెరైక్టరేట్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోదన్నారు. వాన్‌పిక్ కోసం 30 వేల ఎకరాలు అవసరమైనప్పుడు రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు 3 వేల ఎకరాలు సరిపోతుందా అని ప్రశ్నించారు.
చర్చించకుండా రాష్ట్రం ప్రకటిస్తారా?: కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులతో చర్చించకుండా రాష్ర్టం ప్రకటించినందువల్లే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. అందుకోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ నియమించిన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ ముందు తాము వాదనలు వినిపించబోమన్నారు.
హైదరాబాద్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవటం దారుణమని విమర్శించారు. నిజాం రాజులు హైదరాబాద్‌లో ప్యాలెస్‌లు నిర్మిస్తే, తన హయాంలో ఆర్థిక, వ్యాపార పరమైన సంస్థలు వచ్చాయన్నారు. బీజేపీతో పొత్తు అంశంపై మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. రాష్ట్ర విభజన విషయంలో ఏమైనా కసరత్తు చేశారా అంటే శ్రీకృష్ణ కమిటీని నియమించామని చెప్పటం సరికాదన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసేటపుడు, ఆ తరువాత తెలంగాణ ఉద్యమం వచ్చినపుడు అప్పటి ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ రాష్ట్రానికి వచ్చి మాట్లాడి వెళ్లారని, ప్రస్తుత ప్రధాని ఆ పని ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. గంటకుపైగా ఆయన విలేకరులతో మాట్లాడినా ఏ విషయం స్పష్టంగా చెప్పకుండా అంతా గందరగోళం చేశారని ఆ తర్వాత పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.