కోజికోడ్: సంచలనం సష్టించిన టి.పి.చంద్రశేఖరన్ హత్య కేసులో కేరళ సీపీఎంకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ హత్య కేసులో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సహా 11 మందికి ప్రత్యేక కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో నిందితుడికి మూడేళ్ల కారాగార శిక్ష వేసింది. కోజికోడ్ జిల్లాలోని ఓంచియామ్ గ్రామంలో సీపీఎం పెత్తనాన్ని నిరసిస్తూ తిరుగుబాటు చేసి రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ నెలకొల్పిన చంద్రశేఖరన్ 2012 మే 4న దారుణంగా హత్యకు గురయ్యారు.
ఏడుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆయనపై 51 సార్లు కత్తిపోట్లు పొడిచినట్లు శవపరీక్షలో తేలింది. సీపీఎంకు చాలా కాలం సేవలందించిన నేతను సొంత పార్టీ నేతలే చంపించడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పినరయి విజయన్, అచ్యుతానందన్ వర్గాల మధ్య ఇది పెద్ద వివాదమే రేపింది. కాగా రాజకీయ కారణాలతోనే చంద్రశేఖరన్‌ను హత్య చేశారని జడ్జి అభిప్రాయపడ్డారు.
.