బస్సును వెంబడిస్తూ.. వేధింపులు
మంగళగిరి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విజయవాడ కళాశాలలకు విద్యార్థినులతో వెళ్లే బస్సులకు అకతాయిల బెడద ఎక్కువైంది.
* బస్సులను రోజూ వెంబడిస్తూ ఆగడాలు
* విద్యార్థినులకు వేధింపులు.. డ్రైౖ వర్లకు బెదిరింపులు
* బరితెగించి బీరుసీసాలతో దాడి
* పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైౖ వర్లు
మంగళగిరి: మంగళగిరి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విజయవాడ కళాశాలలకు విద్యార్థినులతో వెళ్లే బస్సులకు అకతాయిల బెడద ఎక్కువైంది. కళాశాలలకు వెళ్లే సమయంలోను, సాయంత్రం వచ్చే సమయంలోను కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో వెంబడిస్తూ బస్సులలోని విద్యార్థినులను వేధించడమే కాక, బస్సు డ్రైౖ వర్‌లు ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగుతున్నట్లు డ్రై వర్లు చెబుతున్నారు. మంగళగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు పదిహేను నుంచి ఇరవై బస్సులు విద్యార్థినీ, విద్యార్థులను కళాశాలలకు తీసుకువెళ్తుంటాయి. వీటిలో ప్రత్యేకంగా విద్యార్థినులు వెళ్లే బస్సులను చాలా కాలంగా కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో వెంబడిస్తూ వేధిస్తున్నారు.
ఛేజ్ చేసి మరీ..
సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి వస్తున్న ఓ కార్పొరేట్ కళాశాల బస్సు వెంట నలుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలతో వెంబడిస్తూ వచ్చారు. బస్సు డ్రైవరు ఆపకుండా వెళ్లగా... జాతీయరహదారిపై మండలలోని ఆత్మకూరు గ్రామం సాయిబాబాగుడి వద్దకు చేరుకునే సరికి గట్టిగా అరుస్తూ వచ్చిన యువకులు తమ చేతులలోని బీర్‌బాటిళ్ళతో బస్సు అద్దాలను పగులగొట్టారు.
దీంతో కంగారుపడ్డ డ్రైవర్ బస్సును ఆపకుండా పట్టణంలోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. దీంతో మంగళవారం బస్సుల డ్రైవర్లు అందరూ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. డ్రైౖవర్లు పలువురు మాట్లాడుతూ తాము ఫిర్యాదు చేశామని తెలిసి యువకులు తమపై దాడులకు తెగబడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల ఆగడాలపై కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని సోమవారం దాడికి గురైన కళాశాల బస్సు డ్రైవర్లు వాపోయారు. ఒక్కోసారి యువకులు బస్సుల వెంట వాహనాలు నడిపే వేగంతీరు తమను ఆందోళనకు గురిచేస్తోందని, వారు రోడ్లపై చేసే అగడాలకు తాము ఎక్కడ ప్రమాదాలను కొని తెచ్చుకుంటామోననే భయం వెంటాడుతోందన్నారు. యువకుల వ్యవహారశైలి శ్రుతి మించిన కారణంగానే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.