కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న శివశంకర్
హైదరాబాద్: ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాల్సింది పోయి డబ్బుల కోసం వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శివశంకర్ (26) బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఎస్‌ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బాచుపల్లిలోని శ్రీలక్ష్మీ ట్రావెల్స్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అవసరాల కోసం స్నేహితులైన బాబి, జగదీశ్‌ల వద్ద రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో చెల్లించక పోవడంతో స్నేహితులిద్దరూ వేధించ సాగారు. గత 15 రోజుల నుంచి శివశంకర్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు.
విషయాన్ని ట్రావెల్స్ నిర్వాహకులకు చెప్పి, కొంత డబ్బు అడ్వాన్సు ఇమ్మనగా.. అందుకు వారు నిరాకరించినట్టు తెలిసింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివశంకర్ బుధవారం రాత్రి ఎస్‌ఆర్ నగర్ సమీపంలోని బాపూనగర్‌లో గల శ్రీలక్ష్మీ వైన్‌షాపు పక్కలైన్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలకు గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకుని తీవ్ర గాయాలకు గురైన శంకర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి చిన్నమ్మ రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. శివశంకర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment