భారత్, పాక్ మధ్య చైనా గొడవేమిటీ?
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పీచమణచడానికి భారత్ ఎలాంటి దాడులకు సాహసించినా పాకిస్థాన్‌కు తాము అండగా నిలబడతామని చైనా బహిరంగంగానే ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఆర్థికంగా మూడవ బలమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను కాదని, బలహీనమైన పాకిస్థాన్‌కు చైనా అండగా నిలబడడానికి బలమైన కారణం ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్’. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులే.
ఇరుదేశాల మధ్య ఈ ఎకనామిక్ కారిడర్ చైనా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా బలూచిస్థాన్‌లోని గ్వాడర్ రేవు వరకు విస్తరించి ఉంది. ఇరు దేశాల ప్రయోజనార్థం ఇరుదేశాల భారీ పెట్టుబడులతో నిర్మిస్తున్నప్పటికీ ఈ కారిడర్ వల్ల పాకిస్థాన్‌కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం. ఈ కారిడార్ కింద నిర్మిస్తున్న మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు 5,100 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని ప్రస్తుత అంచనాలు తెలియజేస్తున్నాయి. వీటిలో 3,300 కోట్ల డాలర్లను విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు ఖర్చు పెడుతుండగా, మిగతా సొమ్మును జల,రోడ్డు,రైలు మార్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఉన్నాయి.వీటితో తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్ సమస్య పూర్తిగా సమసిపోతుంది.
ఈ ఎకనామిక్ కారిడార్‌లో ఇరుదేశ ప్రభుత్వాలు పెట్టుబడులు పెడుతున్నప్పటికీ పాకిస్థాక్‌ను అవసరమైన పెట్టుబడులను రాయతీలపై చైనా ఎగ్జిమ్ బ్యాంక్, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాలే సమకూర్చాయి. ఈ కారిడార్‌లో భాగంగా కరాచీ-లాహోర్ మధ్య 11,000 కిలోమీటర్ల మోటార్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రావల్పిండి-చైనా సరిహద్దుకు మధ్య కరకోరమ్ హైవేను అభివృద్ధి చేస్తున్నారు. కరాచి-పెషావర్ మధ్య 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు రైల్వే లైన్‌ను కూడా పునరుద్ధరిస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్టులు సహా ఈ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులన్నీ పాకిస్థాన్‌కు ఉపయోగపడే ప్రాజెక్టులుగానే కనిపిస్తున్నప్పటికీ ఈ మార్గాల గుండా ఆసియా, ఆఫ్రికా, పశ్చిమ యూరప్, ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న మధ్యప్రాచ్య మార్కెట్‌కు తమ సరకులను చేరవేసేందుకు ఈ మార్గాలన్నీ చైనాకు ఉపయోగపడేవే. ప్రపంచ మార్కెట్‌కు ముఖద్వారాలుగా నిలుస్తున్న దుబాయ్, సింగపూర్ దేశాలకు ఈ మార్గాల గుండా చైనా సులభంగా సరకులను చేరవేయవచ్చు. ఇప్పుడు చైనా అమెరికాను కూడా అధిగమించి దుబాయ్, సింగపూర్ దేశాలతో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ కారిడార్ పూర్తయితే చైనా ప్రపంచంలోనే ఆర్థికంగా నెంబర్ వన్ బలమైన దేశంగా ఆవిర్భవిస్తుంది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరగుపడుతుంది. ఇరు దేశాల మధ్య ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. ఎకనామిక్ కారిడార్ వెంట పర్యాటక కేంద్రాలను, హోటళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్ కారణంగా పాకిస్థాన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే ఊపందుకొందని, స్థలం విలువలు నిరుడుకన్నా రెట్టింపు అయ్యాయని పాక్‌లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఆర్‌బీ ఆసోసియేట్స్’ సీఈవో అతిఫ్ ఆలమ్ తెలిపారు.
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు అడ్డంకులు కలిగించే ఎలాంటి పరిణామాలను చైనా కోరుకోదు. అంటే పాకిస్థాన్‌లో అంతర్గత అశాంతి పరిస్థితులనుగానీ, భారత్, పాక్ మధ్య యుద్ధాన్నిగానీ చైనా కోరుకోదన్నమాట. పాక్‌పైన భారత్ దాడి చేయొద్దని ఆశించే చైనా నిజంగా భారత్ దాడలకు దిగితే పాక్‌పైపు నుంచి మనపై దాడులు చేయదు. సంధి కుదుర్చేందుకే ప్రయత్నిస్తుంది. ఇరుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో దౌత్యపరమైన హెచ్చరికలకు పాల్పడుతోంది. చైనా, పాక్ కారిడార్‌కు బలూచిస్థాన్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగడం చాలా ముఖ్యం. అక్కడ అశాంతిని రెచ్చగొడతామనే బెదిరింపులతో భారత్ కూడా ఆ దేశాలను దారికి తీసుకరావచ్చు.