
ట్రంప్ ను ముద్దాడిన 'మంకీ కింగ్'
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికౌతారని చైనాలోని మంకీ కింగ్ 'గెడా' జోస్యం చెప్పింది.
షాంఘై: 2010 ఫుట్ బాల్ ప్రపంచకప్ విజేతను ముందుగానే చెప్పిన ఆక్టోపస్ 'పాల్' మీకు గుర్తుంది కదూ. అచ్చు అలానే చైనాకు చెందిన ఓ కోతి అమెరిక అధ్యక్ష ఎన్నికల విజేతపై జోస్యం చెప్పింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికౌతారని చైనాలోని మంకీ కింగ్ 'గెడా' చెప్పిందటా.
జూ వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇరువురి నేతల వైపు కొంత సేపు తీక్షణంగా చూసిన గెడా ట్రంప్ కటౌట్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత ట్రంప్ కటౌట్ ను కౌగిలించుకుని ఆయన పెదవులను గెడా ముద్దాడినట్టు పేర్కొన్నారు.
గెడా ఈ ఏడాది జరిగిన యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ విజేతను ముందుగానే చెప్పింది. యూరోపియన్ చాంపియన్ షిప్ ఫైనల్ కు పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు దూసుకెళ్లిన తర్వాత ఫైనల్లో పోర్చుగల గెలుస్తుందని చెప్పింది. అది ఎలా అంటే.. పోర్చుగల్, ఫ్రాన్స్ జాతీయ జెండాల వద్ద అరటి పండును ఉంచారట.
ఆ తర్వాత గెడాను ఆ జెండాల ముందు వదిలేశారు. కొద్ది సేపు ఆలోచించుకున్న గెడా పోర్చుగల్ వద్ద ఉన్న అరటిపండును తీసుకుని ఆరగించినట్లు జూ నిర్వహకులు తెలిపారు. ప్రస్తుతం చైనాలోని షియాన్హూ ఎకోలాజికల్ టూరిజం పార్కులో మంకీ కింగ్ 'గెడా' ఉంటోంది.