
శత్రువులందరినీ ఓడిస్తాం: జిన్‌పింగ్ వార్నింగ్
మా సైన్యానికి ఆ సామర్థ్యముంది
బీజింగ్: దురాక్రమణకు దిగే శత్రువులందరినీ ఒడించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కు ఉందని చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్ అన్నారు. 23 లక్షల సైనికబలం కలిగిన పీఎల్‌ఏ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ మిలిటరీ పరేడ్‌ను తిలకించిన జిన్‌పింగ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. సర్వోన్నత నాయకత్వమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)కు అనుగుణంగా పీఎల్‌ఏ కచ్చితంగా నడుచుకోవాలని, పార్టీ ఏది సూచిస్తే అది చేయాలని అన్నారు. 'దురాక్రమణకు దిగే శత్రువులందరినీ ఓడించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం మన సాహసోపేతమైన మిలిటరీకి ఉందని నేను బలంగా విశ్వసిస్తున్నాను' అని జింన్‌పింగ్ పేర్కొన్నారు.
సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య నెలరోజులకుపైగా సాగుతున్న ప్రతిష్టంభన గురించి ఆయన నేరుగా ప్రస్తావించలేదు. అయితే, చైనా అధికారిక మీడియా, విదేశాంగ, రక్షణశాఖలను ఉటంకిస్తూ భారత్ చైనా భూభాగంలోకి చొరబడిందని పేర్కొంటూ.. యుద్ధ బెదిరింపు కథనాలను ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం చైనా సైన్యానికి ఉందని ఆయన అన్నారు.