నేను పార్టీలో ఇమడలేకపోతున్నా..
చంద్రబాబు కోప్పడుతున్నారు
ఎంపీ రాయపాటి వ్యాఖ్యలు
ప్రత్తిపాడు: సీఎం చంద్రబాబు తనను తిడుతున్నారని, తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలకు గురువారం రాత్రి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ... మాచర్ల, వినుకొండ, గురజాల గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించేందుకు రూ.1120 కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు పూనుకున్నానని, ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళితే నిధులు లేవన్నారని తెలిపారు.
కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మనకు, ఢిల్లీకి అంటీముట్టనట్లుగా ఉందని, అక్కడ నేను గట్టిగా అడిగితే బాబు తిడుతున్నారని (దొబ్బేస్తున్నారని) వాపోయారు. దీంతో అప్పు కోసం బ్యాంకర్లతో మాట్లాడానని, పది నుంచి పదిహేను సంవత్సరాల్లో తీసుకున్న అప్పును 9.6 శాతం వడ్డీతో తిరిగి చెల్లించేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నారని, అయితే చంద్రబాబు 8.5శాతం అయితే ఓకే అంటున్నారని చెప్పారు.
గుంటూరు రైల్వేజోన్‌కోసం ఒత్తిడి చేద్దామంటే సీఎం కోప్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య తాను సీపీఐ వాళ్లకు భోజనాలు పెడితే, ఎందుకు పెట్టావని పార్టీ వాళ్లు ప్రశ్నించారని చెప్పారు. ‘ఇక్కడ నేను ఇమడలేకపోతున్నాను.. రత్తయ్య గారూ ఇన్నాళ్లు మీరెలా ఇమిడి ఉండిపోయారు..’ అని అదే వేదికపై ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను ప్రశ్నించారు. చంద్రబాబు తనను తీసుకెళ్లి అడవుల్లో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే తన వ్యాఖ్యలన్నీ ‘ఆఫ్ ది రికార్డ్’ అని, రాయవద్దని బహిరంగసభ చివర్లో రాయపాటి చెప్పడం గమనార్హం.