పట్టిసీమతో ‘సీమ’కు నీళ్లు రావు
టీడీపీ ఎంపీ జేసీ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మించతలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు రావని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం దుర్వినియోగమేనని విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతి సంవత్సరం ఈ సమయానికి కృష్ణా నదిలో నీళ్లు ఉండేవి. ఈమారు నీళ్లు లేవు. దీని వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నది, కష్టపడుతున్నది రాయలసీమ. సీఎం రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారు.
కానీ దీని వల్ల డెరైక్టుగా రాయలసీమకు నీళ్లు రావు. పట్టిసీమ వల్ల ఏమవుతుంది? విజయవాడ వద్ద కృష్ణా నదికి నీళ్లు ఇచ్చి.. అక్కడి పంటలు కాపాడి.. అక్కడ మిగిల్చిన నీళ్లను ఆ తరువాత శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇవ్వాలని ఆయన ఉద్దేశం. ఆయన కల ఫలిస్తుందా? లేదా? అన్న అనుమానం వస్తోంది. ఈరోజు కృష్ణా నదిలో శ్రీశైలానికి నీళ్లు రావాలంటే ఆల్మట్టి, నారాయణపూర్ నిండాలి. తరువాత గద్వాల వద్ద ఉన్న ప్రాజెక్టులు నిండాలి.
ఇవన్నీ ఐదారేళ్ల క్రితం వచ్చిన ప్రాజెక్టులు. తొలుత ఎవరికి అవసరం ఉందో వారికివ్వాలి. ఆ పద్ధతి ఇప్పుడు కృష్ణానదిపై లేదు. కావేరి నదికి ఉంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే కృష్ణా బోర్డును ఆశ్రయించాలి. లేదంటే కేంద్రాన్ని సంప్రదించాలి. అవసరమైతే కొందరం ప్రయివేటు వ్యక్తులం సుప్రీం కోరుకెళ్లేందుకు సిద్ధం’ అని జేసీ పేర్కొన్నారు.