
జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు పోలికేంటి?
- కేంద్రాన్ని డిమాండ్ చేయబోనన్న ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: తమిళనాడులో జరుగుతోన్న జల్లికట్టు ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్‌కు పోలిక ఏమిటో అర్థం కావడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నాడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి చెందిన నాయకులు.. నేడు విచిత్రంగా లేఖలు రాస్తున్నారు’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును ఉద్దేశించి విమర్శలు చేశారు. అమరావతిలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన సీఎం ఏపీకి హోదా కోసం కేంద్రంతో గొడవపెట్టుకోనని మరోసారి చెప్పారు.
‘రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలను నూటికి నూరు శాతం నెరవేర్చుతున్నాం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లాగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న రాష్ట్రం దేశంలో మరొకటిలేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ప్రత్యేక హోదా కోసమో, మరొకదానికోసమో కేంద్రంతో గొడవపడుతూ కూర్చోలేను. అయినా, గొడవలు పెట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందా? అభివృద్ధి జరుగుతుందా?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ జనవరి 26న విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలన్న వైఎస్సార్‌సీపీ పిలుపుపై కూడా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘వైజాగ్‌లో కొవ్వొత్తులు కాగడాలు పట్టుకుని తిరిగితే ఏం వస్తుంది? మా పాలనలోనే వైజాగ్ విశ్వనగరంగా ఎదిగింది’ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని భారతదేశంలో తీసుకురావడం తన ఘనతేనని సీఎం చెప్పుకున్నారు. ఇండియాలో మొబైల్ లావాదేవీలు పెరిగాయని, విశాఖను సైబర్ సెక్యూరిటీ, ఫిన్ టెక్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని రూపొందిస్తున్నామని చంద్రబాబు వివరించారు.