చంద్రబాబు దావోస్ పర్యటనపై సీఎంవో వివరణ
విజయవాడ: చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదివారం మరోసారి వివరణ ఇచ్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో పాల్గొనేందుకు తనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చిందంటూ సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకోగా.. అలాంటి ఆహ్వానం లేనేలేదని, రూ.కోట్ల ఫీజు చెల్లించి వెళ్లారని ‘సాక్షి’ బయటపెట్టిన నేపథ్యంలో సీఎంవో వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
ద్వైపాక్షిక సమావేశాలతోపాటు ఇతర సదస్సుల్లో చంద్రబాబు పాల్గొన్నారని తెలిపిన సీఎంవో.. ‘సాక్షి’ లేవనెత్తిన ప్రశ్నకు.. ప్రధాన వేదికపై ప్రసంగించే వక్తల జాబితాలో చంద్రబాబు ఉన్నారా? లేరా? అనేదానికి మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. (చంద్రబాబు దావోస్ పర్యటనల ఆంతర్యమిదే)
దావోస్‌లో గతవారం జరిగిన 47వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రత్యేకంగా తనకు ఆహ్వానం వచ్చిందని చంద్రబాబు చెప్పడం, అక్కడ పలు సంస్థల అధిపతులతో ఆయన చర్చలు జరిపినట్లు రోజూ ఎల్లో మీడియాలో ప్రముఖంగా ఫొటోలు కనిపించడం తదితర అంశాలపై ‘సాక్షి’ ఆరా తీయగా బాబువన్నీ డ్రామాలేనని తేలింది. దీనిపై ప్రచురితమైన ’స్టాల్ పెట్టు.. ప్రచారం కొట్టు’ కథనంతో చంద్రబాబు దావోస్ పర్యటనలన్నీ తననో ఆర్థిక మేధావిగా చూపించుకునేందుకు అబద్ధాలు, అభూత కల్పనలతో సాగిన కట్టుకథలేనని ప్రజలకు స్పష్టమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ క్రమం తప్పకుండా చేస్తున్న ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ లేకపోగా ఖజానాపై మాత్రం రూ.కోట్ల భారం తప్పడంలేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. (దావోస్ సదస్సుకు టికెట్ కొనాల్సిందే!)