
కాగ్నిజెంట్ లాభం 12 శాతం పెరుగుదల
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ
సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,974 కోట్లు
న్యూయార్క్: ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను స్వల్పంగా సవరించింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 444 మిలియన్ డాలర్ల (రూ.2,974 కోట్లు) లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం 397 మిలియన్ డాలర్ల (రూ.2,659 కోట్లు)తో పోల్చి చూస్తే లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. ఈ కాలంలో ఆదాయం సైతం 8.4 శాతం పెరిగి 3.45 బిలియన డాలర్ల (రూ.23,115 కోట్లు)కు చేరుకుంది. గతంలో పేర్కొన్న వార్షిక ఆదాయ అంచనాలను కంపెనీ తాజాగా సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (జనవరి - డిసెంబర్) ఆదాయం 13.47 నుంచి 13.53 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని తాజా అంచనాలను ప్రకటించింది.
రూ.33 కోట్ల అక్రమ చెల్లింపులు...
భారత్‌లోని తమ కార్యాలయాలకు సంబంధించి 5 మిలియన్ డాలర్ల (రూ.33 కోట్లు) మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు అమెరికాకు చెందిన ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ వెల్లడించింది. సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులు కొందరికి ఇది తెలిసి ఉంటుందని, వారి పాత్ర ఇందులో ఉండి ఉండవచ్చని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌లో తమ కార్యాలయాలకు అనుమతులు, భవనాల లెసైన్‌సల కోసం అక్రమ చెల్లింపులు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్నదానిపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నట్టు సెప్టెంబర్‌లో కాగ్నిజెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రూ.33 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు విచారణలో తెలిసిందని కంపెనీ సీఎఫ్‌వో కరేన్ మెక్‌లాగిన్ తెలిపారు.