కలెక్షన్ కింగ్
పైసా మే పరమాత్మ హై అని ఎవరైనా అంటే.. అదేమో గానీ తన ఆత్మ మాత్రం వాటి చుట్టూనే తిరుగుతుంటుంది అంటారాయన. అయితే అయనకు డబ్బుపై ఆశ కాదు... అభిరుచి. నాణేల నుంచి కరెన్సీ నోట్ల దాకా సేకరించే సరదా. ‘మనకున్న అలవాట్లే మనల్ని మంచి అభిరుచులకు చేరువ చేస్తాయి. బహుశా ఆ హాబీనే నన్ను బ్యాంక్ ఉద్యోగం ఎంచుకునేలా చేసి ఉంటుంద’ని అంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమల్ చక్రవర్తి. పురాతన నాణేల నుంచి నయా కరెన్సీ నోట్ల వరకు ఇలా ప్రతి ఒక్కటీ సేకరించిన ఆయన.. అన్న ఇచ్చిన తొలి పూర్వపు నాణేమే ఈ రోజు భారీ కలెక్షన్ చేసే దిశగా నడిపించిందని చెప్పారు.
‘ఆ తర్వాత మిత్రులు, కొంత మంది స్క్రాప్ వ్యాపారుల నుంచి విభిన్న నాణేలు సేకరించాను. ఇదే క్రమంలో నాకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బద్వాణీలో ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను. హెచ్‌సీయూ సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా చేస్తున్నా. ఆర్‌బీఐ విడుదల చేసే స్మారక నాణేలు కూడా భద్రంగా దాచిపెడుతున్నాన’ని వివరించారు చక్రవర్తి.
ది బెస్ట్..
‘హరప్పా, మొహంజోదారా, కుషాణ్, మొఘల్ కాలాల నాటి ఆకర్షణీయమైన నాణేలు... ది వరల్డ్ ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాంక్ నోట్లు... ఇలా 85 దేశాలకు చెందిన నోట్లు, నాణేలు సేకరించారు చక్రవర్తి. 300 బీసీకి చెందిన అలెగ్జాండర్, నెపోలియన్ కాయిన్స్, బెనిన్ రిపబ్లిక్, నిజాం, తంజావూరుకు చెందిన రూ.1000 నాణేం, ఆస్ట్రేలియాకు చెందిన పెంగో నోట్, యుగోస్లోవియాకు చెందిన ఐదు ట్రిలియన్ల నోట్, పది మిలియన్ల జపనీస్ నరోట్, జార్జ్ 6 కింగ్ కాయిన్, బంగ్లాదేశ్‌కు చెందిన 60 టకల నోట్లు చూసి చాలా మంది ఆయనను అభినందిస్తున్నారు. వీటి సంఖ్య వేలల్లోనే ఉంటుందంటున్నారు చక్రవర్తి.
- సాక్షి, వీకెండ్ ప్రతినిధి