
'కాంగ్రెస్ మా పోస్టర్ కాపీ కొట్టింది'
పోస్టర్ చూసి సినిమా ఎలాంటిదో చెప్పేయవచ్చు. పోస్టర్‌లో విషయం ఎంత బాగుంటే సినిమా కూడా అంత బాగుంటుందంటారు.
న్యూఢిల్లీ : పోస్టర్ చూసి సినిమా ఎలాంటిదో చెప్పేయవచ్చు. పోస్టర్‌లో విషయం ఎంత బాగుంటే సినిమా కూడా అంత బాగుంటుందంటారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చినట్లుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు అంతగా కలిసొస్తున్నట్లు లేదని భావించిన హస్తం పార్టీ... వెంటనే పోస్టర్ మార్చేసింది. నేను కాదు మనం అంటూ రాహుల్‌గాంధీ ఫోజ్‌తో విడుదలైన పోస్టర్లు ఇప్పుడు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నాయి.
విడగొట్టొద్దు... కలిసుందాం అనే నినాదంతో ఏర్పాటు చేసిన కొత్త పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేను కాదు మనం అనే టైటిల్‌తో రూపొందిన పోస్టర్‌ను తమను చూసే కాపీ కొట్టారని బీజేపీ మండిపడుతోంది. గతంలోనే తాము మోడీ ముఖ చిత్రంతో ఆ పోస్టర్‌ను విడుదల చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ ఆ పోస్టర్‌ను కాపీ చేసిందని ఎద్దేవా చేసింది.