పళనీ.. బలపరీక్షకు సిద్ధపడు..!
చెన్నై: అధికార అన్నాడీఎంకేలోని శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా పళనిస్వామి బలపరీక్షకు సిద్ధపడాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఈ విషయమై లేఖ రాశారు. రాష్ట్రంలో అసాధారణ రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని, ఈ నేపథ్యంలో ఎంతమాత్రం జాప్యం చేయకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిందిగా సీఎంకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకేతో స్వరం కలిపింది. వెంటనే అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేఆర్ రామస్వామి లేఖ రాశారు.
శశికళ వర్గం ఎమ్మెల్యేలు 19మంది తిరుగుబాటు చేయడంతో పళని సర్కారు విశ్వాసపరీక్షలో ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్, డీఎంకేలు భావిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. శశికళ వర్గం వ్యూహాత్మకంగా తన 19మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని విండ్‌ఫ్లవర్ రిసార్ట్‌కు తరలించింది. కాగా, ఈ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే కార్యకర్తలు రిసార్ట్ ఎదురుగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.