కాస్త హోం వర్కు చేసుకుని రండి బాబూ!
కాంగ్రెస్ ఎంపీలు సభకు వచ్చేముందు తగినంత హోం వర్కు చేసుకుని రావట్లేదంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. రాజ్యసభలో విపక్ష ఉపనేత ఆనంద్ శర్మ ఇచ్చిన నోటీసును ఉద్దేశించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన నోటీసులో ఎవరి రాజీనామాకు డిమాండ్ చయలేదని, పైగా.. సభలో మాత్రం మంత్రులు రాజీనామా చేయాలంటూ కేకలు పెడుతున్నారని అన్నారు.
వాళ్లు హోంవర్కు చేయకుండా వచ్చి, తమ ఉచ్చులో తామే బిగుసుకుంటున్నారన్నారు. పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారని, దేశ ప్రజలు వాళ్లను క్షమించే ప్రసక్తి లేదని మంత్రి చెప్పారు. వాళ్లు తగినంత హోం వర్కు చేసుకుని వచ్చి, సభను సజావుగా నడవనివ్వాలని కోరారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజెలతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు గట్టిగా పట్టుబట్టడంతో రాజ్యసభ వాయిదాల పర్వంతో నడుస్తున్న విషయం తెలిసిందే.