
ప్రమాదకర ఆట ఆడుతున్న కాంగ్రెస్: వెంకయ్య
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఈరోజు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన బహుమానంగా అందరూ చెబుతున్నారు. రాష్ట్ర విభజన అంటే కాంగ్రెస్ అంతర్గత వ్వవహారం కాదన్నారు.
''రాష్ట్ర విభజన సాధారణమైన విషయం కాదు. విభజన విషయంలో ముఖ్యమంత్రిని, మంత్రులను విశ్వాసంలోకి తీసుకోలేదు. తమను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలే చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి ప్రణాళిక ఏమైనా ఉందా? 2004 నుంచి 2013 వరకు కాంగ్రెస్ ఏం చేసింది? విభజనపై కేంద్రం ఎటువంటి కసరత్తు చేసింది? బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుల్లా మెలుగుతున్నారా? కాంగ్రెస్ నేతలతో కూడిన ఆంటోనీ కమిటీ వల్ల ప్రయోజనం ఏమిటి?'' అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేశారన్నారు. హైదరాబాద్ ప్రజల భద్రతపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయన్నారు.