విపక్షాల గొంతు నొక్కుతున్నారు
వరుసగా మూడోరోజూ కాంగ్రెస్ నిరసన
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. తమ పార్టీ సభ్యులు 25మందిని సస్పెండ్ చేయటంపై మూడు రోజులుగా నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్, గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పార్టీ ఇతర సీనియర్ నేతలంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. తమ పార్టీ నేతలను సస్పెండ్ చేసి తమ గొంతును ప్రజలకు చేరకుండా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ, జేడీయూ, ఆర్జేడీలు ధర్నాలో పాల్గొన్నాయి.
పార్లమెంటు లోపలా అదే పరిస్థితి
గురువారం ఉభయసభల్లోనూ విపక్షాల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఉదయం 11గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే సమాజ్‌వాది, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం పార్టీలు నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాయి. విపక్షాలను స్పీకర్ అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీల సభ్యులు సభనుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు.
కాగా, స్పీకర్ అధికార నివాసం ఎదుట బుధవారం నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్‌పై బీజేపీ హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చింది. ఇటు రాజ్యసభలో వరుసగా మూడో రోజూ ఎలాంటి కార్యక్రమాలు సాగలేదు. దిగువసభలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా ఆ పార్టీ సభ్యు లు పెద్దల సభలో నినాదాలు చేశారు. అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని చూసిన ప్రభుత్వ ప్రయత్నాలు గురువారమూ ఫలించలేదు. అయితే పరిస్థితి చక్కపడకపోవటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ శుక్రవారానికి సభను వాయిదా వేశారు.
చెక్‌బౌన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
చెక్‌బౌన్స్ చట్ట సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. చెక్ బౌన్స్ అయిన సందర్భంలో చెక్ జారీ చేసిన ప్రాంతంలో కాకుండా, దాని క్లియరెన్స్ కోసం వేసిన బ్యాంక్ ఉన్న ప్రాంతంలో కేసు పెట్టేందుకు దీంతో అవకాశం లభిస్తుంది. మరోవైపు 30 ఏళ్లకు పైబడిన 295 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
పంచాయతీలకు రూ. రెండు లక్షల కోట్లు!
పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రానున్న ఐదేళ్లలో దేశంలోని గ్రామపంచాయతీలకు రూ. 2,00,292 కోట్లు కేటాయించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ గురువారం లోక్‌సభకు తెలిపారు. నాణ్యమైన పనులు చేపట్టేలా పంచాయతీల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దేశంలో 2,39,812 పంచాయతీలుఉంటే... వీటిలో 43,653 పంచాయతీలకు సొంత భవనం లేదని తెలిపారు.
పోటాపోటీగా విప్‌ల జారీ: ఎంపీలందరూ శుక్రవారం రాజ్యసభకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌లు విప్‌లు జారీచేశాయి. ప్రభుత్వం ఏవైనా బిల్లులను రాజ్యసభ ముందుకు తేవడానికి ప్రయత్నించవచ్చని, అందుకే బీజేపీ విప్ జారీచేసిందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. అందుకే హడావుడిగా తమ ఎంపీలకు విప్ జారీచేసింది.