ఉత్తరప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను ఎన్నికల సంఘం కేటాయించిన మరుసటి రోజే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీతో పొత్తుకు వెనుకాడబోమని కాంగ్రెస్ పార్టీ నేత మీమ్ అఫ్జాల్ మంగళవారం ప్రకటించారు. ఎస్పీ మొత్తం అఖిలేష్ వెంట ఉందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అఖిలేష్ కూడా సుముఖంగా ఉన్నారు. త్వరలో రాహుల్ గాంధీతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, రాష్ట్రీయ లోక్దళ్‌లతో కలసి మహాకూటమి ఏర్పాటు చేసేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. పొత్తు అవకాశముందని అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్ కూడా ధ‍్రువీకరించారు. ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.