నెలాఖరులోగా ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ
- రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు
- 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం
- ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం కాలుష్య భత్యం
- దరఖాస్తు చేసుకున్న వారంలో కారుణ్య నియామకాలు
- చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు, భద్రత
- 40 టీఎంసీల సామర్థ్యంతో ‘గ్రేటర్’కు రెండు తాగునీటి జలాశయాలు, ఆస్తి పన్ను రాయితీ, నల్లా బిల్లు బకాయిల మాఫీ
- సుదీర్ఘంగా 11 గంటలపాటు కేబినెట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. కొత్త పంథాలో బడ్జెట్ తయారీకి రూపకల్పన చేయటంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెలాఖరులోగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినేట్ ఆదేశించింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది. దాదాపు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని సీఎం కేసీఆర్ ఉజ్జాయింపుగా వెల్లడించారు.
‘తొలిసారిగా జరిగిన కాంట్రాక్టు నియామకాల్లో రిజర్వేషన్లను పాటించలేదు. ఆ తర్వాత పాటించారు. అందుకే ఈ రెగ్యులరైజేషన్‌తో రిజర్వేషన్ రోస్టర్ నిబంధనలకు ఇబ్బంది కలిగితే సంబంధిత కేటగిరీలో అవసరమైనన్ని బ్యాక్‌లాగ్ పోస్టులు సృష్టించి తర్వాత వాటిని భర్తీ చేస్తాం. అవినీతి, పైరవీలకు ఆస్కారం లేకుండా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. శాఖల వారీగా ఉద్యోగులు, విధివిధానాలు త్వరలోనే ఖరారవుతాయి’ అని సీఎం వెల్లడించారు.
అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచే పెరిగిన వేతనం అమల్లోకి రానుంది. మూడు కేటగిరీలుగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో రూ.6,700 జీతం పొందుతున్న వారికి రూ.12 వేలు, రూ.8,400 వేతనం ఉన్న వారికి రూ.15 వేలు, రూ.10,900 వేతనం పొందుతున్న వారికి రూ.17 వేలకు పెంచింది. ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల అదనపు భారమైనప్పటికీ సరిపడేంత వేతనం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందులో 1,225 ఉర్దూ పాఠశాలల పోస్టులున్నాయి.
శనివారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సుదీర్ఘంగా పదకొండు గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ ఇంత సుదీర్ఘంగా కేబినేట్ సమావేశం కావటం ఇదే మొదటిసారి. మారియట్ హోటల్‌లో మధ్యాహ్న భోజనానికి, డిప్యూటీ సీఎం మనుమరాలి వివాహానికి సీఎం సహా మంత్రులు వెళ్లటంతో కేబినేట్ మధ్యలో రెండుసార్లు దాదాపు గంట పాటు విరామం ఇచ్చారు. కేబినేట్‌లో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, పద్మారావు సీఎం వెంట ఉన్నారు. దాదాపు అరవై అంశాలకుపైగా ఇందులో చర్చించారు.
సీఎం వెల్లడించిన ముఖ్యాంశాలివీ..
- రాష్ట్ర వ్యాప్తంగా 18 వేలకు పైగా ఉన్న హెయిర్ సెలూన్స్‌కు వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. వాటిని గృహాల కేటగిరీకి మార్చాలని ఎన్నో ఏళ్లుగా నాయి బ్రాహ్మణులు కోరుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే సెలూన్లను గృహ కేటగిరీ కిందకి మార్చాలని నిర్ణయించాం. అందుకు సంబంధించిన రూ.144 కోట్లను ప్రభుత్వం రూ.144 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తుంది.
- ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం భద్రత కల్పిస్తాం. వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో రుణాల మంజూరీలో సహకరిస్తాం. వారిపై వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
- ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం బారిన పడి తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వీరికి చెల్లిస్తున్న మూల వేతనంపై 30 శాతం అదనంగా కాలుష్య భత్యం చెల్లించాలని నిర్ణయించాం. నేటి నుంచే (జనవరి 3) దీన్ని అమలు చేస్తాం.
- హైదరాబాద్ నగరానికి ఎప్పుడో నిజాం నవాబు నిర్మించిన హిమాయత్‌నగర్, గండిపేట జలాశయాలే ఇప్పటికీ దిక్కు. హైదరాబాద్‌ను గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకునే గత పాలకులు నగరానికి తాగునీటి రిజర్వాయర్లను నిర్మించలేకపోయారు. దేశంలోని ఏ చిన్న నగరాన్ని చూసినా దానికి సమీపంలోనే తాగునీటి జలాశయం కనిపిస్తుంది. హైదరాబాద్ నగర శివార్లలో సైతం 40 టీఎంసీల సామర్థ్యంతో కేవలం తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాలను నిర్మిస్తాం. ఒకటి రామోజీ ఫిల్మ్‌సిటీకి దగ్గరగా రాచకొండ గుట్టల్లో, రెండోది శామీర్‌పేట వద్ద నిర్మిస్తాం. ఇందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంస్థ రూ.7,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేబినేట్ ఆమోదించింది.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్షిక ఆస్తి పన్ను రూ.1,200 లోపు ఉన్న గృహ యజమానుల నుంచి కేవలం రూ.101 మాత్రమే వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కేబినేట్ ఆమోదించింది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో 3.12 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 15 ఏళ్లుగా పేరుకుపోయిన నీటి చార్జీల బకాయిలను మాఫీ చేయాలని నిర్ణయించాం. ఇకపై కచ్చితంగా బిల్లులు వసూలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాఫీ వల్ల రూ.455 కోట్ల బాకాయిలు మాఫీ కానున్నాయి.
- మైనారిటీల సంక్షేమ శాఖలో ఒక్క రెగ్యులర్ పోస్టు లేదు. ఉన్నవారంతా డిప్యూటేషనే. ఇకపై ప్రతి జిల్లాలో ఆరుగురు అధికారులు, రాష్ట్ర స్థాయిలో మైనారిటీల డెరైక్టరేట్ కార్యాలయంలో 20 మంది అధికారులు ఉండేలా మైనారిటీల సంక్షేమ శాఖ డెరైక్టరేట్‌కు 80 పోస్టులను మంజూరు చేశాం.
- నీటిపారుదల శాఖకు 108 కొత్త పోస్టులు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 147 పోస్టులు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు 462 పోస్టులు మంజూరు చేశాం.
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మైనారిటీ బాలికలకు 30, బాలురకు 30... మొత్తం 60 మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తాం.
- జీహెచ్‌ఎంసీలో స్థలా భావంతో పేదలకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నాం. 9 అంతస్తులుండే భవనాల్లో లిఫ్టులు అవసరం. అందుకే జీహెచ్‌ఎంసీలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వ్యయాన్ని రూ.5.30 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలని నిర్ణయించాం.
- నిర్ణీత సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 1.5 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తున్నాం. ఈ ప్రోత్సాహకాలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సైతం వర్తింపజేయాలని నిర్ణయించాం.
- రాష్ట్రంలోని 97 పట్టణ ఆరోగ్య కేంద్రాలను పీహెచ్‌సీల స్థాయికి తగ్గట్లు అభివృద్ధి పరుస్తాం.
- ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో ఇండియన్ రిజర్వు పోలీసు బెటాలియన్‌కు 115 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించాం.
- ఉద్యోగ విరమణ రోజే ఉద్యోగులకు పెన్షన్ ప్యాకేజీని అందించటంతో పాటు ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటికి గౌరవంగా సాగనంపుతాం.
- పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల దరఖాస్తులు వెంటనే పరిష్కరిస్తాం. కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉంచకుండా 7 రోజుల్లోనే ఉద్యోగాన్ని కల్పిస్తాం. సంబంధిత శాఖ ఖాళీలు లేకపోయిన ఇతర ఏ శాఖలోనైనా అవకాశాన్ని కల్పిస్తాం.