‘కీ’లకం కరెంట్ అఫైర్సే | Current affairs to key role of Groups candidates | Sakshi
Sakshi News home page

‘కీ’లకం కరెంట్ అఫైర్సే

Published Tue, Sep 22 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

‘కీ’లకం కరెంట్ అఫైర్సే

‘కీ’లకం కరెంట్ అఫైర్సే

* ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి
* ‘డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్’కు ప్రిపేరవ్వాలి
* దేన్నయినా ఒకటికి రెండుసార్లు కన్‌ఫర్మ్ చేసుకోవాలి
* గ్రూప్స్ అభ్యర్థుల ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలంటే...
* ‘సాక్షి’తో టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) ప్రత్యేక సబె ్జక్టు కాదు. పలు సబ్జెక్టులకు సంబంధించిన తాజా అంశాలు, వాటిలోని మార్పులనే కరెంట్ అఫైర్స్‌గా పేర్కొంటాం. మరోలా చెప్పాలంటే అన్ని రకాల సబ్జెక్టుల అంశాల కొనసాగింపేనన్నమాట. ఏ పోటీ పరీక్షకైనా కరెంట్ అఫైర్స్‌ది ప్రత్యేక స్థానం. వాటిపై సంపూర్ణ అవగాహన ఉన్న అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో విజయం నల్లేరుపై నడకే’’ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్‌గా, బిట్స్ పిలానీ ఎకనామిక్స్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సంస్థల్లో ఫ్యాకల్టీగా కరెంట్ అఫైర్స్ బోధనలో ప్రత్యేక స్థానమున్న ఆయన... గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేష న్‌పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
 విశేషాలు...
 కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ప్రధానంగా ఆరు రకాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సబ్జెక్టేమిటి, సమకాలీన అంశమేమిటన్న తేడాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో జీఎస్‌డీపీ అని చదువుకున్నాం. దాన్ని కరెంట్ అఫైర్స్ కింద అడిగేప్పుడు వ్రస్తుతం జీఎస్‌డీపీ ఎంత? అందులో ధోరణులేమిటి? జీఎస్‌డీపీలో ఏ రంగం వాటా ఎంత? ఆయా రంగాల్లో తేడాలెలా వస్తున్నాయి? ఏ రంగం పురోగతిలో ఉంది? ఏది తగ్గుతోంది? ఇలాంటివన్నీ వస్తాయి. ఇక జీఎస్‌డీపీ అంటే ఏమిటనేది ఎకానమీ అవుతుంది. భారత రాజ్యాంగమంటే పాలిటీ అవుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక రాష్ట్రం ఏర్పాటు, సంబంధిత పరిణామాలన్నీ కరెంట్ అఫైర్సే అవుతాయి.
 
 1.    సబ్జెక్టు చదువుతూ ముందుకు: సంబంధిత సబ్జెక్టు చదువుతూ, అందులో భాగంగా సమకాలీన అంశాలను చదువుకోవాలి. సబ్జెక్టు చదవకుండా కేవలం సమకాలీన అంశాలే చదివితే ప్రయోజనకరం కాదు.
 2. సాధికారిక వనరుల నుంచే చదువుకోవాలి. చాలామంది పత్రికలపై ఆధారపడతారు. వాటిల్లోనూ తప్పులు రావచ్చు. కాబట్టి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. విమర్శనాత్మకంగా, తులనాత్మకంగా చదువుకోవాలి.
 3. సమకాలీన అంశాలను కాన్సెప్ట్‌తో కలిపి చదవాలి. దాంతోపాటు ఆ అంశానికి సంబంధించిన నేపథ్యాన్నీ కలిపి చదివితే ఎక్కువగా గుర్తుంటుంది. సమగ్ర అవగాహనకూ ఉపయోగపడుతుంది. కేవలం ఆబ్జెక్టివ్ టైపే చదివి ఊరుకుంటే విషయంలో స్పష్టత లేక పరీక్షలో నష్టపోతారు. ఉదాహరణకు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం తీసుకుంటే సైన్స్ టెక్నాలజీలో సమకాలీన అంశం. అది గుర్తుండాలన్నా, దాని ప్రత్యేకత అర్థం కావాలన్నా భారత రోదసీ రంగ ం మొత్తం చదవాలి. అందులో విజయాలేమిటన్నది చదవాలి. అప్పుడే దాని బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు అన్నీ తెలుస్తాయి. అప్పుడు ప్రశ్న ఎలా అడిగినా సమాధానం రాయడం సులభమవుతుంది.
 4. సమకాలీన అంశాలను నిరంతరం అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ప్రస్తుతమెంత అని అడిగితే ఈ రోజు ఉన్న వృద్ధి రేటు రాస్తాం. కానీ పరీక్ష ఆరు నెలలు వాయిదా పడితే సమాధానం మారిపోతుంది. కాబట్టి అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
 5.     సమకాలీన అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. ద్రవ్యోల్బణం రేటు ఎంత అనేది సమాచారం. కాని విశ్లేషణాత్మకంగా చదవాలంటే అందులో ఉండే ధోరణులేమిటి? లక్షణాలేమిటి? ఎందుకు తగ్గుతోంది? ఇలాంటివన్నీ విశ్లేషించాలి.ఉదాహరణకు టోకు ధరల సూచీ తగ్గుతోంది. కాని వినిమయ ధరల సూచీ పెరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా పప్పుదినుసుల సూచీ పెరుగుతోంది. వస్తు తయారీ రంగ ధరల సూచీ తగ్గుతోంది. ఇలా అనేకముంటాయి. కాబట్టి ప్రిపరేషన్‌లో విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఇదివరకట్లా ఆహార ద్రవ్యోల్బణం రేటెంత తరహాలో ఇప్పుడు ప్రశ్నలడగటం లేదు. ఆహార ద్రవోల్బణానికి కారణాలేమిటంటూ లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంపూర్ణంగా చదివితే తప్ప లాభముండదు. అందుకే సమకాలీన అంశాలను ఫ్యాక్ట్ బేస్డ్‌గానే కాకుండా అనాలసిస్ బేస్డ్‌గా చదవాలి. ప్రిపరేషన్‌లో విషయమే గాక విశ్లేషణా ఉండాలి.
 6. డిస్క్రిప్టివ్ టు ఆబ్జెక్టివ్: డిస్క్రిప్టివ్‌గా ప్రిపేరై ఆబ్జెక్టివ్‌గా సమాధానాలు రాయాలి. కానీ ఇప్పుడంతా ఆబెక్టివ్‌గా చదువుతున్నారు. అది సరికాదు. డిస్క్రిప్టివ్‌లో లాజికల్ పద్ధతిలో ప్రిపరేషన్ ఉంటుంది. అలాగాక ఆబ్జెక్టివ్‌గా ప్రిపేరైతే దేని గురించి చదువుతున్నదీ అర్థం కాదు. అందుకే పరీక్ష ఆబ్జెక్టివ్‌గా రాసినా ప్రిపరేషన్ మాత్రం డిస్క్రిప్టివ్‌గా చదవాలి.
 
 వివాదాస్పద అంశాలపై ఎలా రాయాలంటే...
 వివాదాస్పద అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు జాగ్రత్తగా రాయాలి. సాధారణంగా ఒక అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా రాయాలా, వ్యతిరేకంగానా అనే ప్రశ్న సహజంగా గ్రూప్-1లో డిస్క్రిప్టివ్‌లో వస్తుంది. ఇది ఆలోచనకు సంబంధించినది. కార్మిక సంస్కరణలను తీసుకుంటే వీటిపై ఏం రాయాలన్న అనుమానాలుంటాయి. అలాంటప్పుడు వాటిపై ఇలా రాయాలి...
 
 1. భారతదేశంలో కార్మిక సంస్కరణలు మంచివనే అభిప్రాయముంది, చెడ్డవనీ ఉంది. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం ఇది మంచి అని, విమర్శకుల దృష్టిలో చెడు అని ఉంది. పరీక్ష రాసేప్పుడు దీన్ని సిద్ధాంతాలకు, ఆకాంక్షలకు అతీతంగా చూడాలి. భిన్న వాదనలు రాయాలి. అవి రాస్తూ, అభ్యర్థి తనపరంగా కూడా హేతుబద్ధమైన అభిప్రాయానికి రావచ్చు. కానీ అది హేతుబద్ధంగా, విశ్లేషణాత్మకంగా, మేధోపరమైన అభిప్రాయంగా ఉండాలి. అంతేతప్ప సిద్ధాంతపరమైన అభిప్రాయంగా ఉండొద్దు. కార్మిక సంస్కరణలు ప్రయోజనకరం కాదని, దోపిడీకి కారణాలని... ఇలా ఏకపక్షంగా రాయొద్దు. అదే సమయంలో సంస్కరణలు మాత్రమే శరణ్యమనీ రాయొద్దు. అభ్యర్థులకు సమాజాన్ని నిశితంగా పరిశీలించే సామర్థ్యం ఉందా, లేదా అని మాత్రమే గ్రూప్-1 వంటి పరీక్షల్లో చూస్తారు. అంతేతప్ప ప్రభుత్వానికి వందిమాగధులుగానో, వైరిపక్షులుగానో ఉండాలని ఆశించరు. ఎందుకంటే ఈ రెండూ కరెక్టు కాదు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో రాయాల్సిన అవసరం లేదు. భిన్న వాదనలు రాయాలి. హేతుబద్ధమైన అభిప్రాయానికి రావచ్చు. కాకపోతే ప్రభుత్వోద్యోగానికి పోతూ ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయం రాయడం సరికాదు.
 2. ‘మేకిన్ ఇండియా’ను తీసుకుంటే... ఈ కార్యక్రమమే బోగసని రాస్తే అది తప్పు. అమలులో ఇబ్బందులుంటే వాటిని రాయడంలో అభ్యంతరం లేదు. లేదా విమర్శకులు అభిప్రాయాలిలా ఉన్నాయని రాయొచ్చు. అంతే తప్ప సొంత అభిప్రాయంగా రాయొద్దు. భిన్నాభిప్రాయాలను, విమర్శలను రాయాల్సి వచ్చినపుడు విమర్శకుల అభిప్రాయంగానే రాయాలి. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
 3. న్యాయమూర్తుల నియామకాలు జరిపే కొలీజియం వ్యవస్థను రద్దు చేసి న్యాయ నియామకాల కమిషన్ వేసిన విషయం తీసుకుంటే.. దాని ప్రయోజనాలేమిటని ప్రభుత్వం చెబుతోందో రాయాలి. అలాగే సుప్రీంకోర్టు ఏం చెబుతోంది, దాని అభిప్రాయమేమిటన్నదీ రాయా లి. రెండిటినీ విశ్లేషించి, మీకో అభిప్రాయం ఏర్పడితే అది కూడా రాయాలి. కానీ ప్రభుత్వ అభిప్రాయాన్నో, సుప్రీంకోర్టు అభిప్రాయాన్నో ఖండించేలా ఉండొద్దు. మేధోపరమైన విశ్లేషణలతో కూడిన అభిప్రాయంగా రాయొచ్చు.
 
 రెండు రకాలుగా అంశాల విశ్లేషణ కొన్ని సాధారణాంశాలూ ఉంటాయి. కొన్ని నిర్దిష్టమైన అంశాలుంటాయి, ఒక అంశంపై ప్రశ్నను సాధారణంగా అడిగినపుడు, ఒక పాయింట్ తీసుకొని దాన్ని బలపరిచే అంశాలను, విశ్లేషణను రాయాలి. ఉదాహరణకు భారత ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా అనడిగితే.. ముందుగా ఆర్థిక సంక్షోభమంటే ఏమిటో నిర్వచించాలి. ఆర్థిక వ్యవస్థకు కొలబద్ధ ఏమిటో విశ్లేషించాలి. ఆర్థిక వ్యవస్థకు కొలబద్ధలు 1. వృద్ధిరేటు, 2. ఎగుమతులు, దిగుమతులు, 3. విదేశీ మారకద్రవ్య నిల్వలు, 4.ద్రవ్యోల్బణం, 5.ద్రవ్యలోటు, 6. ప్రస్తుత ఖాతాల లోటు 7. రుణభారం. ఇలాంటి అంశాలను తీసుకోవాలి. ప్రతి అంశంలో వాస్తవాలేమిటో విశ్లేషించాలి. వాట న్నింటినీ కలిపి తే వచ్చే సమగ్ర రూపాన్ని సమాధానంగా రాయాలి. అంతేతప్ప ఏదో ఒక పాయింట్ పట్టుకుని, దాని ఆధారంగా సూత్రీకరణకు రాకూడదు. సూత్రీకరణ ఎప్పుడు సమగ్రంగా, ప్రామాణిక సమాచారం ఆధారంగా ఉండాలి. మరీ అన్ని కోణాలనూ విశ్లేషించేలా ఉండొద్దు. అలాగని మరీ పరిమితమైన కోణంలోనూ ఉండొద్దు.
 
 నిర్దిష్టమైన అంశాలు
 నిర్దిషమైన ప్రశ్న అడిగితే జవాబూ నిర్దిష్టంగానే రాయాలి. ద్రవ్యోల్బణంపై ప్రశ్న అడిగితే దాని పైనే జవాబు రాయాలి. అంతే తప్ప జనరల్‌గా అన్నీ కలిపి జవాబు కింద రాయొద్దు. అందు కే అడిగిన ప్రశ్నను ముందు అర్థం చేసుకోవాలి. ఏమడిగారు, జవాబెలా రాయాలన్నది అర్థం చేసుకోవాలి. అదే సమయంలో సాధారణ అంశంపై ప్రశ్న అడిగితే ఏదో ఒక అంశంపై నిర్దిష్టమైన జవాబు రాసినా మార్కులు రావు. నిర్దిష్టమైన ప్రశ్నకు తెలిసిన సమాచారమంతా రాసినా అంతే.
 
 సమపాళ్లలో సమకాలీన అంశాలు
 అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయాంశాలన్నీ దాదాపు సమపాళ్లలో ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయమంటే ఒక్క తెలంగాణవే. గతంలో ఉమ్మడి ఏపీ అంతా ప్రాంతీయ. అలాగని ఇప్పుడు ఏపీ గురించి అడగరా అంటే అడుగుతారు. అయితే అవి జాతీయాంశాల్లోకి వెళ్లవచ్చు. ఈ ఏడాదిలో తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక, సాంస్కృతిక పరిణామాలు. నియామకాలు. ప్రభుత్వ విధానాలు. పథకాల వంటివాటిపై కరెంట్ అఫైర్స్‌లో ప్రశ్నలడగొచ్చు. అన్నీ కచ్చితంగా సమపాళ్లలో ఉండకపోయినా మొత్తంమీద సమతుల్యత పాటిస్తారు. సబ్జెక్టుల్లోనూ అంతే. రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతికాంశాలు, ప్రదేశాలు, సంఘటనలను దాదాపు సమపాళ్లలోనే అడుగుతారు.
 
 ఫ్యాక్ట్స్‌ను తెలుసుకోవాలంటే..
 ఏ పరీక్షలోనైనా జవాబులు రాసేప్పుడు ఫ్యాక్ట్స్‌ను (వాస్తవాంశాలను) జాగ్రత్తగా పరిశీలించాలి. ఇవి మూడు రకాలుగా ఉంటాయి.
 1. అబ్సల్యూట్, 2. ఎనలిటికల్, 3. లింక్డ్ ఫ్యాక్ట్స్
 ఉదాహరణకు ద్రవ్యోల్బణరేటనేది అబ్సల్యూట్ ఫ్యాక్ట్. దానికి సంబంధించిన ఇతర అనేకాంశాలు లింక్డ్ ఫ్యాక్ట్స్. ఇక పలు అంశాల మధ్య సంబంధం గురించి చర్చిందేది విశ్లేషణాత్మక ఫ్యాక్ట్స్. కృష్ణా గోదావరి అనుసంధానం తీసుకుంటే, నదుల అనుసంధానం ఫ్యాక్ట్. తత్సంబంధిత ఇతర అంశాలు లింక్డ్ ఫ్యాక్ట్స్. నదుల అనుసంధానానికి సంబంధించిన ఇతర ప్రతిపాదనలు తదితరాలన్నమాట. ఇక అనుసంధానంపై భిన్నాభిప్రాయాలు, అనుభవాలు, పరిణామాలు విశ్లేషణాత్మక ఫ్యాక్ట్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement