కరెంట్ అఫైర్స్
సాహిత్య పురస్కారాలు – విజేతలు
కాంపిటీటివ్ గైడెన్స్
వివిధ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో అవార్డులు అందుకున్నవారు – ఇచ్చే సంస్థలు/వ్యక్తులపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ అవార్డులు, ఇటీవల కాలంలో వాటిని అందుకున్న విజేతల గురించి తెలుసుకుందాం..
జ్ఞాన్‌పీఠ్ అవార్డ్: మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని 1965 నుంచి ప్రదానం చేస్తున్నారు. అవార్డ్ గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. తొలి గ్రహీత మలయాళం రచయిత జి.శంకర కురూప్. 52వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 27న ప్రముఖ బెంగాలీ రచయిత శంఖఘోష్ (2016 సంవత్సరానికి)కు ప్రదానం చేశారు. ఆయన 2011లో పద్మభూషణ్ కూడా అందుకున్నారు.
మూర్తీదేవి అవార్డ్: భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ఈ అవార్డ్‌ను తొలిసారి 1983లో కన్నడ రచయిత సి.కె.నాగరాజరావుకు ప్రదానం చేసింది. అవార్డ్ కింద రూ.నాలుగు లక్షల నగదును అందజేస్తారు. 2016కు ఈ అవార్డును ప్రముఖ మల యాళీ రచయిత, పాత్రికేయుడు ఎం.పీ. వీరేంద్ర కుమార్ అందుకున్నారు. ఆయన రాసిన ‘హైమవత భూవిల్’ అనే పుస్తకానికి అవార్డ్ దక్కింది. ఇది 30వ మూర్తీదేవి అవార్డ్. ఎం.పీ.వీరేంద్రకుమార్ మలయాళం దినపత్రిక మాతృభూమి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు.
2015లో ఈ పురస్కారం తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్‌కు ‘అనంత జీవనం’ అనే పుస్తకానికి లభించింది.సరస్వతీ సమ్మాన్: కె.కె.బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఏర్పాటు చేసింది. దీని కింద రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. 1991లో ప్రముఖ హిందీ రచయిత హరివంశరాయ్ బచ్చన్‌కు మొదటిసారి ఈ పురస్కారం దక్కింది. 2016కు ఈ అవార్డ్‌ను ప్రముఖ కొంకణి రచయిత మహాబలేశ్వర్ సెయిల్‌కు మార్చి 9న ప్రకటించారు. ఆయన రాసిన ‘హాథాన్’ అనే నవలకు ఈ పురస్కారం లభించింది.
వ్యాస్ సమ్మాన్: కె.కె. బిర్లా ఫౌండేషన్ కేవలం హిందీ రచనలు చేసేవారికి 1991లో వ్యాస్ సమ్మాన్‌ను ఏర్పాటు చేసింది. దీని కింద రూ.3.50 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. వ్యాస్ సమ్మాన్ 2016కు ప్రముఖ హిందీ రచయిత సురేంద్ర వర్మకు లభించింది. ఆయన రాసిన ప్రముఖ నవల ‘కాట్నా షమీకా వృక్షః పద్మ పంఖరి కో ధార్ సే’ పురస్కారం దక్కించుకుంది. ఆయన 26వ వ్యాస్ సమ్మాన్ గ్రహీత.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్
సాహిత్య అకాడమీ.. గతేడాది డిసెంబర్ 21న 24 భాషల్లో అవార్డులను ప్రకటించింది. వీటిని ఫిబ్రవరి 22న ప్రదానం చేశారు. నగదు బహుమతి రూ. లక్ష. ‘రజనీ గంధ’ అనే కవితా సంపుటికి తెలుగు రచయిత పాపినేని శివశంకర్‌కు ఈ పురస్కారం లభించింది.
ఎన్. విజయేందర్ రెడ్డి
జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్