
సైరస్ మిస్త్రీపై టాటా సంచలన ఆరోపణలు
- తప్పుదోవ పట్టించి చైర్మన్ అయినట్టు ఆరోపణ
దేశంలో అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకటైన టాటా కంపెనీలో బోర్డ్‌రూమ్ సంగ్రామం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై టాటా గ్రూప్ సంచలన ఆరోపణలు చేసింది. రతన్ టాటా వారసుడి విషయంలో సెలెక్టర్లను తప్పుదోవ పట్టించి మిస్త్రీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని, ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, కంపెనీ అధికారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకోవడంపైనే దృష్టిపెట్టిన మిస్త్రీ.. తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి మేనేజమెంట్ స్ట్రక్చర్‌ను బలహీనపరిచారని ఆరోపించింది. టాటా గ్రూప్‌కు చెందిన కీలక లిస్టెడ్ కంపెనీల బోర్డు నుంచి మిస్త్రీని తొలగించేందుకు మరికొన్నిరోజుల్లో వాటాదారుల సమావేశం జరగనున్న నేపథ్యంలో మిస్త్రీపై విశ్వాసం సన్నగిల్లి.. ఆయనకు ఉద్వాసన పలుకడానికి కారణమైన కీలక వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నట్టు టాటా సన్స్ తన తాజా లేఖలో తెలిపింది.
రతన్‌టాటా వారసుడిగా టాటా సన్స్ చైర్మన్ ఎంపిక కోసం 2011లో ఏర్పాటుచేసిన సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పుదోవ పట్టించారని, టాటా గ్రూప్ గురించి తన ప్రణాళికలపై ఆడంబర ప్రకటనలు చేశారని, టాటా గ్రూప్ కోసం విస్తారమైన మేనేజ్‌మెంట్ స్ట్రక్చర్‌ను ఏర్పాటుచేస్తానని, గ్రూప్‌కు ఉన్న విభిన్న వ్యాపారాల నేపథ్యంలో అధికార, బాధ్యతల విభజన కోసం మేనేజ్‌మెంట్ నిర్మాణాన్ని మారుస్తానని ఆయన చెప్పుకొచ్చారని, ఈ ప్రకటనలే మిస్త్రీని చైర్మన్‌గా ఎంపిక చేయడానికి ప్రధాన కారణమని, కానీ వాస్తవానికి నాలుగేళ్లు అయినా మేనేజ్‌మెంట్ స్ట్రక్చర్ విషయంలో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని, కాబట్టి ఇది సెలక్షన్ కమిటీని తప్పుదోవ పట్టించడమేనని టాటా సన్స్ పేర్కొంది.