
సీఎంకు చెప్పలేదనడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని తనకు చెప్పలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ‘తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ’ అనే అంశంపై బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి డి.శ్రీనివాస్, బి.సారయ్య, మధుయాష్కీ, కె.యాదవరెడ్డి(కాంగ్రె స్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు (టీడీపీ), ఈటెల రాజేం దర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హరీశ్‌రావు, ఎం.బిక్షపతి, నల్లాల ఓదేలు, కె.స్వామిగౌడ్, పి.సుధాకర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), గుండా మల్లేష్, కూనంనేని సాంబశివరావు (సీపీఐ), యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(బీజేపీ)తో పాటు రాజకీయ జేఏసీ చైర్మ న్ కోదండరాం, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందే కాంగ్రెస్ హైకమాండ్ చాలా కసరత్తు చేసిందని, అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిందని, ఎన్నో కమిటీల ద్వారా అధ్యయనం చేయించిందని వివరించారు. సీఎం కిరణ్‌తోనూ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ సంప్రదింపులు జరిపిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ పట్టుదలతో ఉన్నారని, ఎన్ని కుట్రలు చేసినా దానిని అడ్డుకోలేరని డీఎస్ స్పష్టం చేశారు.
అయితే విభజనకు ఆటంకం కలిగేవిధంగా సవరణ డిమాండ్లు ఉండకూడదని డీఎస్ హెచ్చరించారు. మధు యాష్కీ మాట్లాడుతూ.. పార్టీలు, నాయకులు సొంత లాభం మానుకుంటే తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. టీడీపీ ప్రతినిధులు రేవూరి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి మాట్లాడుతూ బిల్లుకు సవరణలు చేయాలనే అధికారం శాసనసభకు లేదని, సభ్యులు సూచనలను మాత్రమే చేయాల్సి ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో చర్చకు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరించారని చెప్పారు. టీఆర్‌ఎస్ నేత ఈటెల మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు, ఎంపీలకు సవరణలు చేయాల్సిన అంశాలపై వినతిపత్రాలను ఈ నెల 16న అందిస్తామన్నారు. బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చాలా అంశాలపై సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. సీపీఐ నేతలు మల్లేష్, కూనంనేని ప్రసంగిస్తూ ఆంక్షలు లేని తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడతామన్నారు.
కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కలలుగన్న రాష్ట్ర సాధన కోసమే బిల్లులో సవరణల కోసం సూచనలు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించగా జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, సి.విఠల్, దేవీప్రసాద్, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంక్షల్లేని తెలంగాణ కోసం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఉండాలని తీర్మానించారు.