
దిగ్విజయ్‌తో డీఎస్ భేటీ
* ‘రాయల తెలంగాణ’కు టీ-నేతలు ఒప్పుకోవాలన్న దిగ్విజయ్
* రాహుల్ పిలుపుతో నేడు మళ్లీ హస్తినకు డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం నుంచి అందిన పిలుపుతో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. హస్తినలో దిగిన వెంటనే ఆయన ఆదివారం రాత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. సుమారు 35 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాయల తెలంగాణ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సానుకూల వాతావరణం కోసం సాగించే ప్రక్రియలో భాగంగానే రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా డీఎస్‌కు దిగ్విజయ్ స్పష్టంచేసినట్లు సమాచారం.
నదీ జలాల అంశం సహా రాజకీయ లబ్ధిని ఆలోచించే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నామని.. దీనికి తెలంగాణ నేతలు ఒప్పుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు తనతో సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారెవరూ అంగీకరించబోరని దిగ్విజయ్‌కు డీఎస్ స్పష్టంచేసినట్లు సమాచారం. తెలంగాణ సంస్కృతికి, సీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల సంస్కృతికి 200 ఏళ్ల వైరుధ్యం ఉందని ఆయన వివరించినట్లు చెప్తున్నారు.
డీఎస్ సోమవారం ఉదయం మరికొందరు అధిష్టానం పెద్దలను కలిసి, రాయల తెలంగాణ అంశమై చర్చించనున్నారు. ఇదిలావుంటే.. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా మళ్లీ సోమవారం ఉదయం ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినందునే ఆయన హస్తిన వెళుతున్నట్లు తెలుస్తోంది.
బిల్లు సాఫీగా సాగేందుకే ‘రాయల’ ఎత్తుగడ
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు సాఫీగా సాగేందుకే రాయల తెలంగాణ అంశాన్ని హైకమాండ్ పెద్దలు తెరపైకి తెచ్చి ఉంటారని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వాళ్లు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం పట్టుపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యం కావాలని నినదిస్తున్నారే తప్ప రాయల తెలంగాణ ఎవరూ కోరుకోవటం లేదు. ప్రత్యేక సంస్కృతి కలిగిన రాయలసీమ ప్రజలు కూడా రాయల తెలంగాణ కోరుకోవటం లేదు. అసెంబ్లీలో విభజన బిల్లు సాఫీగా సాగేందుకే హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.