దాద్రి లాంటి ఘటనలవల్ల బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
పనాజి: దాద్రి లాంటి ఘటనలవల్ల బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశంలో జరుగుతున్న మతపరమైన హింసలకు ఆరెస్సెస్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. పనాజీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదివారం రాత్రి దాటాక మీడియాతో మాట్లాడారు. 'దాద్రివంటి ఘటనలు బీజేపీ, ఎన్డీయేకు నష్టాన్ని కలిగిస్తాయని నేను భావిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ను కూడా దీనివల్ల దెబ్బతినే అవకాశం లేకపోలేదు.
అయితే, వాస్తవానికి బీజేపీకి, ఎన్డీయేకు ఇలాంటి వాటితో సంబంధం లేదు. అవి అలా జరగాలని కూడా కోరుకోవు. కొన్ని ఘటనలకు స్థానికంగానే ప్రాధాన్యం లేకపోయినప్పటికీ కావాలనే ఓ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు వాటికి దేశ వ్యాప్త ప్రచారం కల్పిస్తున్నాయని నా పరిశీలనలో కనుగొన్నాను' అని పారికర్ అన్నారు. తన ఇంట్లో గోమాంసం ఉందనే కారణంతో మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని కొందరు హిందువులు దాడి చేసి కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కాగా, దానిపై ప్రధాని కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా రక్షణమంత్రి పారికర్ స్పందించడం కొంత చర్చనీయాంశమైంది.