
తండ్రి రాంవిలాస్ తో చిరాగ్ పాశ్వాన్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కేటాయించిన స్థానాల పట్ల లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ మొదట తమకు చెప్పింది ఒకటి, తీరా కేటాయింపులో చేసింది మరొకటని ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్, రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నిప్పు లేకుండా పొగ రాదని వ్యాఖ్యానించారు. బీజేపీతో మరోసారి చర్చలు జరిపి చూస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశారు.
గత అర్థరాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీట్ల పంపకంపై ఆగ్రహం లేదని అసంతృప్తి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తమకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు. సీట్ల కేటాయింపుతో తమకు షాక్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీకి 40, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కు 23, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్‌ఏఎమ్-ఎస్)కు 20 స్థానాలు కేటయించారు. బీజేపీ 160 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.