మియాపూర్‌లో ‘సమాచార విశ్లేషణ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. ప్రభుత్వపథకాలు, బ్యాంకు రుణాలు, వ్యక్తిగత వివరాల సమాచార మార్పిడి, విశ్లేషించేందుకు ‘సమాచార విశ్లేషణాకేంద్రం (డాటా ఎనలైటికల్ సెంటర్) ఏర్పాటు కానుంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్ 20,28 తేదీల్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించాలని రంగారెడ్డి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తాజాగా లేఖ రాశారు. మెట్రో రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ సెంటర్ ఉండేలా చూడాలని నిర్దేశించారు.
ఆధార్ అనుసంధానిత ప్రాజెక్టుల అమలుకు దిక్సూచిగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు, పాస్‌పోర్టుల జారీ, పింఛన్ల మంజూరు, బ్యాంకు ఖాతాలు, ఆదాయ పన్ను చెల్లింపు సమయంలోను ఆధార్ విశిష్ట సంఖ్య నమోదును తప్పనిసరి చేశారు. దీంతో తప్పుడు సమాచారం పొందుపరిచినా, ప్రభుత్వ పథకాల్లో అనర్హులున్నా తేల్చేందుకు వివిధ సందర్భాల్లో సమర్పించిన డాటాతో విశ్లేషిస్తారు. తద్వారా అక్రమార్కుల గుట్టు బయటకురావడమేగాకుండా.. సమాచార వాస్తవికత ను నిర్ధారించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం జరగకుండా.. పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు వీలు పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
కోహెడలో ఫైరింగ్ రేంజ్!
హయత్‌నగర్ మండలం కోహెడలో పోలీస్ ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. హైదరాబాద్ నగర పోలీసు విభాగానికి ప్రత్యేక శిక్షణాశిబిరం లేకపోవడంతో పొరుగున ఉన్న మహబూబ్‌నగర్ లేదా మొయినాబాద్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను సమకూర్చుకోవాలని నగరపోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు.
దీనికి అనుగుణంగా కోహెడలో పది ఎకరాలను కేటాయించాలని కోరుతూ కలెక్టర్ రఘునందన్‌రావుకు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు గుట్టలు, కొండలతో ఫైరింగ్‌కు అనువుగా ఉన్నట్లు గుర్తించిన భూమిని ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం సర్వేను నిర్వహించింది. త్వరలోనే భూమి కేటాయింపుల అనుమతుల పరిశీలనకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.