
ప్రధానిగారు మీరెప్పుడు మేల్కొంటారు?
కశ్మీర్ లోయ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. తాజాగా భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. మృతుల్లో ఒక విద్యార్థి ఉన్నాడు.
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. తాజాగా భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. మృతుల్లో ఒక విద్యార్థి ఉన్నాడు. మరోవైపు లోయ అంతటా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. దాదాపు 200 చోట్ల జరిగిన ఆందోళనల్లో 300 మంది గాయపడ్డారు.
చెనాబ్ వ్యాలీ, పిర్ పంజాల్ ప్రాంతాలకు ఆందోళనలు పాకడంతో భద్రతా దళాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. లోయలో 29వరోజు కర్ఫ్యూ విధించారు. గత నాలుగువారాలుగా లోయలో జరుగుతున్న ఆందోళనల్లో 55మంది మృతిచెందారు. మూడువేల మందికిపైగా గాయపడ్డారు.
కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితిపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పరిస్థితిని చూస్తే 'గుండె తరుక్కుపోతోంది. బాధ కలుగుతోంది. ఈ సంక్షోభంపై కేంద్రం (గౌరవనీయులైన ప్రధానమంత్రి అని చదువుకోండి) ఇంకా ఎప్పుడో మేల్కొంటుందో' అని ఆయన ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుంటే.. మరోవైపు అక్కడ పరిస్థితి మెరుగుపడుతున్నదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిందని ఆయన మండిపడ్డారు.