మారన్ సహకరించడం లేదు: సీబీఐ
న్యూఢిల్లీ: టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ దర్యాప్తుకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయనను కస్టడీలో ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీబీఐ శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
'టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ లో మారన్ ను కస్టడీలో విచారించాల్సిన అవసరముంది. ప్రభుత్వ టెలిఫోన్ వ్యవస్థను అక్రమంగా సన్ టీవీ కోసం వాడుకున్నారని వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలంటే ఆయనను విచారించాల్సిందే' అని అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాలని దయానిధి మారన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. మారన్ కు ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అంతకుముందు స్టే విధించింది.