పీఏసీ సిఫారసులపై విధిగా చర్చ జరగాలి
చైర్మన్ల సదస్సులో భూమా నాగిరెడ్డి
న్యూఢిల్లీ/కర్నూలు: ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చేసే సిఫారసులపై రాష్ట్రాల చట్టసభల్లో విధిగా చర్చ జరగాలని, ఆ చర్చలో శాసన సభ్యులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండురోజుల రాష్ట్రాల పీఏసీ చైర్మన్ల సదస్సులో ఆయన మాట్లాడారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై, కేంద్ర పీఏసీ చైర్మన్ కేవీ థామస్, రాష్ట్రాల పీఏసీ ఛైర్మన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. మంగళవారం తొలిరోజు ఈ సదస్సులో భూమా మాట్లాడుతూ పీఏసీకి అధికార పక్షాలు, అధికారులు సహకరించకపోవడం వల్ల మెరుగైన పనితీరు సాధ్యపడడం లేదని పేర్కొన్నారు. పీఏసీ సిఫారసులపై చట్టసభల్లో లోతుగా చర్చ జరగడం లేదని, విధిగా అందరు శాసనసభ్యులూ చర్చలో పాల్గొనేలా సంస్కరణలు తేవాలని పేర్కొన్నారు.
భూమా నాగిరెడ్డి ఈ అంశంపై మాట్లాడినప్పుడు అన్ని రాష్ట్రాల చైర్మన్లు ఏకీభవించారు. కేవలం కాగ్ నివేదికల్లోని అంశాలకే పరిమితం కాకుండా కాగ్ నివేదికల్లో లేని అంశాలపై కూడా సుమోటాగా విచారణ జరిపే అధికారం ఉన్నందున దానిని వినియోగించుకోవాలని, అప్పుడే ప్రభుత్వ వ్యయంలో మరింత పారదర్శకత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. భూమా చేసిన సూచనలతో ఏకీభవించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయన్ను అభినందించారు. వివిధ రాష్ట్రాల చైర్మన్లు మాట్లాడినప్పుడు సైతం భూమా ప్రసంగాన్ని ఉటంకించారు. ఈ సదస్సులో వచ్చిన సూచనలు, చర్చలపై బుధవారం కొన్ని తీర్మానాలు చేయనున్నారు.