
సోదరుడిపై దీప సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వ పోరు మరో మలుపు తిరిగింది. జయ వారసురాలిని తానేనని ప్రకటించుకున్న ఆమె మేనకోడలు దీపా కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత సోదరుడు దీపక్ జయకుమార్‌పై విరుచుకుపడ్డారు. దీపక్.. శశికళ వర్గంతో చేతులు కలిపి తనను మోసం చేశాడని పేర్కొన్నారు.
‘దీపక్ తెల్లవారుజామున 5.30 గంటలకు నాకు ఫోన్ చేసి పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పాడు. మీరు నన్ను లోపలికి అనుమతించడం లేద’ని పోలీసులతో దీప వాగ్వాదానికి దిగారు. జయ నివాసంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన మద్దతుదారులతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని అన్నారు. పోయెస్ గార్డెన్ వస్తువులు మాయమవుతున్నాయని ఆరోపించారు. తనను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు.
కాగా, జయలలిత ఆస్తులను తనకు, తన సోదరికి సమానంగా రాసిచ్చారని గతంలో దీపక్ కుమార్ తెలిపారు. జయ ఆస్తులు తమిద్దరికీ చెందుతాయని అన్నారు. మరోవైపు ఈ వివాదంపై మంత్రి డి. జయకుమార్ స్పందించారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.