
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
1,800 స్కూళ్లకు సెలవు
కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతోంది. ఢిల్లీలో వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యంతో హస్తినలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. కాలుష్యాన్ని కొలిచే పరికరాలు, గాల్లో దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయినట్లు సూచించాయి. గాలి నాణ్యత, వాతావరణ అంచనా, పరిశోధన వ్యవస్థ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. 10 పర్టికులేట్ మ్యాటర్ (కాలుష్య స్థాయి) ఉండాల్సిన కాలుష్యం 500 మార్కును చేరింది.
భారీ ఎత్తున కురుస్తున్న పొగమంచు, నగరంలో కాలుష్యం పెరిగిపోవటంతో.. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. శనివారం తన పరిధిలోని 1800 స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు ఎమ్‌సీడీ (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ప్రకటించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాయి. మరికొన్ని స్కూళ్లు ఆవరణలో జరిగే ప్రార్థన, క్రీడల తరగతులను రద్దుచేశాయి. గుర్గావ్, ఢిల్లీలో శాఖలున్న శ్రీరామ్ స్కూలు సోమవారందాకా సెలవు ప్రకటించింది. 10, 12వ తరగతి విద్యార్థులలే హాజరుకావాలంది.
భావితరానికి భయంకరమే!
దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆందోళన వ్యక్తం చేసింది. రోజురోజుకూ తీవ్రమవుతున్న కాలుష్య సమస్య నివారణకు కేంద్రం, ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడింది. ఢిల్లీలో 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కాలుష్యం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మన పిల్లలకు ఎలాంటి భయంకరమైన భవిష్యత్‌ను ఇవ్వబోతున్నామో ఆలోచించుకోవాలనింది. ‘మీ కోసమో (అధికారులు), ప్రజల కోసమో కాదు. మనకోసం కాలుష్యాన్ని నివారించాలి. మనం ఏదైనా సాధించగలం. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోంది’ అని ఎన్జీటీ చైర్‌పర్సన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ప్రమాదకర వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం, అధికారులు ఏ మాత్రం బాధపడకుండా.. ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఎన్జీటీ మండిపడింది. కాలుష్యం ఇంతగా పెరిగిపోతున్న నేపథ్యంలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్లపై తిరగనివ్వొద్దంటూ మళ్లీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.