ఢిల్లీ పీఠం ఎవరికో? | Delhi Assembly Elections Polling today | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పీఠం ఎవరికో?

Published Wed, Dec 4 2013 4:11 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఢిల్లీ పీఠం ఎవరికో? - Sakshi

ఢిల్లీ పీఠం ఎవరికో?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఘట్టానికి తెరలేచింది. మొత్తం 70 స్థానాలున్న హస్తిన అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఈసారి ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

హస్తిన అసెంబ్లీకి నేడే పోలింగ్
కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య ముక్కోణపు పోటీ
బరిలో 810 మంది అభ్యర్థులు
హంగ్ ఏర్పడుతుందంటున్న ప్రీపోల్ సర్వేలు
8న ఓట్ల లెక్కింపు
 

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఘట్టానికి తెరలేచింది. మొత్తం 70 స్థానాలున్న హస్తిన అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఈసారి ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్‌నే మళ్లీ అందలం ఎక్కిస్తారా లేక నరేంద్ర మోడీ ప్రభావంతో కాస్త పుంజుకున్న బీజేపీని బలపరుస్తారా లేదంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అవకాశం ఇస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ద్విముఖ పోటీకే పరిమితమైన ఢిల్లీ పీఠం.. ఆప్ రాకతో సీన్ మారిపోయింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఆప్ నిలబడడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు చెమటోడ్చి ప్రచారం చేశాయి. వరుసగా నాలుగోసారి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది

 

. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, మోడీ, అరుణ్‌జై ట్లీ, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీ తదితరులు ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఇక ఈ ఎన్నికలతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆప్.. వినూత్న ప్రచారంతో జనాల్లోకి దూసుకె ళ్లింది. ఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పలు రోడ్‌షోల ద్వారా ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా హస్తినలో ప్రచారం చేశారు. అన్ని పార్టీలూ ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. మహిళా భద్రత, అవినీతి, ధరల పెరుగుదల, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా వాటి హామీలపర్వం కొనసాగింది. విజయంపై ప్రధాన పార్టీలు వేటికి అవే ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. సీఎం అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, బీజేపీ నుంచి డాక్టర్ హర్షవర్ధన్, ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్‌లు బరిలో ఉన్నారు. షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్‌లు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండగా, అక్కడ బీజేపీ తన అభ్యర్థిగా పార్టీ ఢిల్లీ విభాగం మాజీ చీప్ విజేంద్ర గుప్తాను రంగంలోకి దించింది.

 

దీంతో అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లు మొత్తం 70 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టగా.. బీఎస్పీ(69), బీజేపీ(68), ఎన్‌సీపీ(9), సీపీఎం(3), శిరోమణి అకాలీదళ్ నుంచి ఇద్దరు, ఇతరులు 509 మంది పోటీలో నిలిచారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్ దేవ్ వెల్లడించారు. 32,801 మంది ఢిల్లీ పోలీసులతోపాటు 107 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించినట్టు చెప్పారు.
 
 పార్టీల ప్రధాన హామీలు ఇవే...

 కాంగ్రెస్: షీలాదీక్షిత్
     ఢిల్లీలోని 73 లక్షల మంది ప్రజలకు ఆహార భద్రత చట్టం కింద సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందజేస్తాం
     గృహ వినియోగదారులకు 40 లీటర్ల వరకు సబ్సిడీపై నీళ్లు సరఫరా చేస్తాం. మూడు కొత్త వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం
     {పస్తుతం ఉన్న మరికివాడల స్థానంలో హౌసింగ్ యూనిట్లు నిర్మిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నాలుగు లక్షల ఫ్లాట్లు ఇస్తాం
 
 బీజేపీ: డాక్టర్ హర్షవర్ధన్
     విద్యుత్ చార్జీలు 30 శాతం మేర తగ్గిస్తాం. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోగా కూరగాయల ధరలు తగ్గిస్తాం. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 12కి పెంచుతాం
     మహిళా భద్రత కోసం సీఎం పర్యవేక్షణలో ప్రత్యేక దళంతోపాటు 24 గంటల కాల్‌సెంటర్లు ఏర్పాటుచేస్తాం. మహిళలపై జరిగిన నేరాల కేసులను త్వరితగతిన విచారించేందుకు మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తాం
     ఢిల్లీలో సైకిల్ సంస్కృతిని ప్రోత్సహిస్తాం. ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడానికి వీలుగా కేంద్రీకృత ట్రాఫిక్ ప్రణాళిక రూపొందిస్తాం.
 
 ఆమ్ ఆద్మీ పార్టీ: అరవింద్ కేజ్రీవాల్
     విద్యుత్ చార్జీలను 50 శాతం మేర తగ్గిస్తాం.
     రోజుకు ఒక్కో గృహానికి 700 లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తాం
     మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో త్వరితగతిన న్యాయం అందేలా చూస్తాం.
     అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తాం.


 ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రం
 మొత్తం సీట్లు: 70
 పోలింగ్ బూత్‌లు: 11,763
 మొత్తం ఓటర్లు: 1.19 కోట్లు
 బరిలో ఉన్న అభ్యర్థులు: 810
 ఎక్కవ మంది అభ్యర్థులు ఉన్న స్థానం: బురారీ(23 మంది)
 తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గం: పటేల్‌నగర్(నలుగురు)
 ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం: వికాస్‌పురి (2,82,632)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement