
క్యూలో నిలబడి ఓటేసిన సోనియా, షీలా దీక్షిత్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. వీవీఐపీలు కొలువుదీరిన హస్తినలో ప్రముఖులు తమ ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంకవాధ్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా లోథి ఎస్టేట్‌లో ఓటేశారు. అటు... నేవీ చీఫ్ కామ్‌రాజ్ లేన్‌లో నేవీ చీఫ్ డీకే జోషీ ఓటేశారు.మాజీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ వినోద్‌రాయ్, కాంగ్రెస్ నాయకుడు రామ్‌లాల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామరాజ్‌లేన్‌లో వినోద్‌రాయ్, నిర్మన్ భవన్‌లో రామ్‌లాల్ ఓటు వేశారు.
మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాలు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ మందిర్‌మార్గ్‌లో ఓటు వేశారు. బీజేపీ ముఖ్యమంత్రి హర్షవర్థన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణానగర్‌లో ఆయన ఓటు వేశారు. ఢిల్లీవాసులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకొని గత రికార్డులు బద్దలు కొట్టాలని ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఇక ఉదయం 8 గంటలకు మందకొడినన ప్రారంభమైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీల్లో ఎవరిని గద్దెనెక్కించాలో నిర్ణయించడానికి ఢిల్లీ ఓటర్లు ముందుకు కదిలారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు... ఛత్తీస్‌గడ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటె ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుందని చీఫ్ ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.