షీలా దీక్షిత్ (మాజీ సీఎం)రాయని డైరీ
సమ్‌టైమ్స్.. సూచనలు ఇవ్వగలిగిన వాళ్లే సూచనల కోసం చూస్తుంటారు. సమ్‌టైమ్స్.. ఆదేశాలు ఇవ్వవలసినవాళ్లే ఆదేశాల కోసం చూస్తుంటారు. కాంగ్రెస్ ఇప్పుడు ఆదేశాలు ఇవ్వలేక, సూచనలు తీసుకోలేక సంశయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్! యు.పి. ఎన్నికలు నెలల్లోకి వచ్చిపడ్డాయి. సోనియాజీ ఏమీ మాట్లాడ్డం లేదు. ఓసారి వచ్చి వెళ్లండి షీలాజీ అన్నారు. వెళ్లాను. ‘‘ఎలా ఉన్నారు షీలాజీ’’ అని కుశలం అడిగారు. ‘‘మంచినీళ్లు తాగుతారా షీలాజీ’’ అని ఫ్రిజ్‌లోంచి వాటర్ బాటిల్ తీశారు. ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు షీలాజీ’’ అని గడప దాకా వచ్చి సాగనంపారు! ఎందుకు పిలిచారో చెప్పడం సోనియాజీ మర్చిపోయారా?! ఎందుకు రమ్మన్నారో అడగడం నేను మర్చిపోయానా?!
ఇంటికి వచ్చేటప్పటికి.. నాకోసం ప్రశాంత్ కిశోర్ వరండాలో వెయిట్ చేస్తున్నాడు. ‘‘లోపల కూర్చోలేకపోయావా?’’ అన్నాను. నవ్వాడు. నా వెనుకే లోనికి వచ్చాడు. కుర్రాడు పొలిటికల్ స్ట్రాటజిస్టు. సెంటర్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మోదీని గెలిపించిందీ, స్టేట్‌లో మోదీకి వ్యతిరేకంగా నితీశ్‌కుమార్‌ని గెలిపించిందీ ఇతడేనని కాంగ్రెస్ నమ్మకం. ‘‘2019లో మా రాహుల్‌ని గెలిపిస్తావా?’’ అని ప్రశాంత్‌ని పిలిపించుకుని ఆశగా అడిగారట సోనియాజీ. ‘‘అదెలాగూ ఖాయం సోనియాజీ.. ఇప్పుడైతే యు.పి. సీయెం క్యాండిడేట్‌గా షీలాజీని నిలబెట్టండి’’ అని చెప్పాట్ట. ‘‘నేనలా చెప్పినట్టు సోనియాజీ మీతో అనలేదా షీలాజీ’’ అని అడిగాడు ప్రశాంత్. ‘‘అనలేదు. నా కన్నా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారేమో’’ అన్నాను. తన స్ట్రాటజీని శంకించినట్టుగా ఫీలయ్యాడు. ‘‘కాంగ్రెస్‌తో ఇదే చికాకు. అడుగుతుంది. వింటుంది. విన్నది వదిలేస్తుంది’’ అనుకుంటూ వెళ్లిపోయాడు పొలిటికల్ స్ట్రాటజిస్టు.
ఫోన్ రింగయింది. ‘‘ఓసారి రాగలరా షీలాజీ?’’. సోనియాజీ కాల్! వెళ్లాను.
‘‘కాంగ్రెస్ మళ్లీ పవర్‌లోకి వచ్చేవరకు.. మీరిలాగే వచ్చివెళుతుండాలి షీలాజీ’’ అన్నారు సోనియాజీ నా చెయ్యి పట్టుకుని. ‘‘అలాగే సోనియాజీ’’ అన్నాను. ‘‘ఎలా ఉన్నారు షీలాజీ’’.. కుశలం అడిగారు సోనియాజీ!! సోనియాజీ తర్వాతి ప్రశ్న నేను మంచినీళ్లు తాగడం గురించే అయి ఉంటుందని ఎదురుచూస్తున్నాను.
కానీ సోనియాజీ ఫ్రిజ్ వైపే వెళ్లలేదు! ‘‘షీలాజీ.. యు.పి.కి... ’’అంటూ ఊపిరి తీసుకున్నారు సోనియాజీ. నేను ఊపిరి బిగబట్టాను. ‘‘షీలాజీ.. యూపీ క్యాంపెయిన్‌కి ప్రియాంకను పంపడం కరెక్టేనా’’ అన్నారు సోనియాజీ. ‘‘వండర్‌ఫుల్ సోనియాజీ.. ఆ బ్రిలియెంట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియానే కదా’’ అన్నాను. ‘‘థ్యాంక్యూ షీలాజీ’’ అన్నారు సోనియాజీ. అన్నాక, ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు షీలాజీ?’’ అంటూ పైకి లేచారు సోనియాజీ. సమ్‌టైమ్స్.. కాంగ్రెస్‌కు మనం గుర్తుచేద్దామనుకున్నది అస్సలు గుర్తుకురాదు.
- మాధవ్ శింగరాజు